Hyderabad Beggars : నగరాల్లోని సిగ్నల్ పాయింట్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, చౌరస్తాలో మనం చాలామంది బెగ్గర్స్‌ని చూస్తూ ఉంటారు. వారు పొట్టకూటి కోసం యాచిస్తూ కనిపిస్తారు. అయితే వీళ్లలో కొందరి సంపాదన తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. కొంతమంది బిచ్చగాళ్లు మిలియనీర్లుగా కూడా ఉన్నారు. మెట్రోపాలిటన్లలో కొంతమంది యాచకులు బహుళ ఫ్లాట్లు కలిగి ఉన్నారంటే నమ్మాల్సిందే. అడుక్కుంటూ ఇంత సంపాదించారా అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతగా సంపాదించినా వారు ఇప్పటికీ యాచిస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాలు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాయి.
అదో మాఫియా..
హైదరాబాద్‌లో బిచ్చగాళ్లది ఓ మాఫియా. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఈ మాఫియా అణిచివేత సమయంలో కొన్ని విషయాలు పోలీసులకే షాక్ ఇచ్చాయి. యాచక వృత్తితో కుటుంబాలే ఉపాధి పొందుతున్నాయి. హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ ట్రై–కమిషనరేట్లలో ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర వచ్చి పోయే వాహనదారుల నుంచి భిక్షను కోరుకుంటాయి. భర్త, భార్య, నలుగురైదుగురు పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఒక జంక్షన్‌ను స్వాధీనం చేసుకుంటుంది. ఇతర బిచ్చగాళ్లను అక్కడి బిచ్చం ఎత్తుకోవడానికి అనుమతించదు. సగటున ఓ కుటుంబం రోజుకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు సంపాదిస్తుంది. అని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు. ప్యారడైజ్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కెబిఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిడ్స్ రోడ్, ట్యాంక్ బండ్, కోటి మహిళా కళాశాల, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం వంటి రెమ్యునరేటివ్ జంక్షన్లకు ఈ ముఠాలకు ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంతాలు తమలో తాము విభజించుకున్నారు. ఎక్కడ వివాదాలు తలెత్తినా, పెద్దలు జోక్యం చేసుకుంటారు. సమూహాల మధ్య విభిన్న టైమింగ్ స్లాట్‌లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సంపాదన చూసి కొందరు..
యాచకుల్లో కొన్ని కుటుంబాలు ఇతరులకు, చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఈ సంపాదన చూసిన కొందరు అసాంఘిక వ్యక్తులు మాఫియాను ఏర్పాటు చేసి శారీరకంగా వికలాంగులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలకు ఉపాధి కల్పించడం ప్రారంభించారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.200 ఇస్తూ సెంటర్ అప్పగిస్తున్నారు. ఆహారం, వసతిని కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు.
ధనిక బిచ్చగాళ్లు..
ఇక ప్రపంచంలోని ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే షాక్ అవాల్సిందే. వీరికి ధనవంతులలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు. కానీ ఇప్పటికీ వీధుల్లో యాచిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవుంతులైన బిచ్చగాళ్లలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు లండన్‌కు చెందిన సైమన్ రెట్. ఇతని మొత్తం ఆస్తి 5 లక్షల యూకే ఫౌండ్లు. లండన్‌లో పుట్నీ హై స్ట్రీట్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్ వెలుపల చిరిగిపోయిన బట్టలు ధరించి యాచిస్తాడు. భారత్ లో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా ముంబైలోని భారత్ జైన్ ఉన్నారు. ప్రపంచంలో ఇతనిది రెండో స్థానం. భారత్ జైన్ నికర ఆస్తి రూ.2 కోట్లు. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తాడు. రోజుకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు సంపాదిస్తున్న హైదరబాదీ బిచ్చగాళ్లు తర్వాతి స్థానంలో ఉన్నారు.