Bandla Ganesh: మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేష్.. నిజామాబాద్ నుంచి దిల్ రాజు.. కాంగ్రెస్ ఎంపీ సీట్ల క్యూ

కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్ల కోసం తీసుకుంటున్న దరఖాస్తులకు భారీగా స్పందన వస్తోంది. నేతలు క్యూ కడుతున్నారు. ఇందులో ఇద్దరు తెలుగు సినీ నిర్మాతలు కూడా ఉండడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Written By: Raj Shekar, Updated On : February 2, 2024 4:39 pm
Follow us on

Bandla Ganesh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకూ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలా బలాలను అంచనా వేస్తోంది. క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దరఖాస్తుల విధానం విజయవంతం కావడంతో లోక్‌సభ ఎన్నికల కోసం కూడా అదే విధానం అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో పోటీ చేయాలనుకునేవారు రూ.50 వేలు చెల్లించి దరఖాస్తు అందించాలని సూచించారు.

భారీగా స్పందన..
కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్ల కోసం తీసుకుంటున్న దరఖాస్తులకు భారీగా స్పందన వస్తోంది. నేతలు క్యూ కడుతున్నారు. ఇందులో ఇద్దరు తెలుగు సినీ నిర్మాతలు కూడా ఉండడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేశ్‌ మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాడు. మరో నిర్మాత దిల్‌ రాజు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నిజామాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. నిర్మాతల మండలి ఎన్నికల సమయంలోనే ఆయన హింట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు..
నిజామాబాద్‌ జిల్లా దిల్‌రాజు సొంత జిల్లా. అక్కడి నుంచే పోటీకి దిగే అవకాశం ఉంది. అందుకే ఆయన మాపల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా స్వగ్రామం నర్సింగ్‌పల్లితోపాటు నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా దరఖాస్తు చేసుకుంది.

ఖమ్మం స్థానానికి తీవ్ర పోటీ!
ప్రస్తుత వస్తున్న దరఖాస్తుల సరళిని పరిశీలిస్తే ఖమ్మం స్థానానికి ఎక్కువ పోటీ కనిపిస్తోంది. అగ్రనేతలు ఇక్కడి నుంచి పోటీకి యత్నిస్తున్నారు. మాజీ ఎంపీ రేణుకాచౌదరి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు, రాజేంద్రప్రసాద్‌ ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.