KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య ఏడాదికాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఆ యుద్ధం చేతల వరకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. తాజాగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కూల్చివేతలను అడ్డుకునేందుకు, బాధితులకు అండగా ఉండేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మూసీ పరీవాహక ప్రాంతంలో మంగళవారం(అక్టబర్ 1న) పర్యటించారు. ఆయన పర్యటన ఇప్పుడు ఉద్రికత్తలకు కారణమైంది. ముషీరాబాద్‌లో కేటీఆర్ ఇంటిపై దాడి జరిగింది. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొందరు కేటీఆర్ కారు ఎక్కే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కగా పోలీసులు లాక్కెళ్లారు. ఆందోళనకారుల చేతుల్లో కొండా సురేఖ ఫ్లెక్సీలు కనిపించాయి. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ముషీరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కేటీఆర్ పర్యటనపై కాంగ్రెస్ దృష్టి..
కేటీఆర్ మూసీ బాధితుల పరామర్శ పేరుతో చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిపెట్టింది. అంబర్‌పేట, గోల్నాకలో కేటీఆర్‌పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అయితే అక్కడికి భారీగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గొడవ జరుగకుండా చర్యలు చేపట్టారు. చివరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటికి కేటీఆర్ లంచ్‌కు వచ్చిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాడికి యత్నించారు.
కూల్చివేతలు షురూ..
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తొలి ప్రక్రియలో భబాగంగా రివర్‌బెడ్‌లో కూల్చివేతలు చేపట్టారు. చాదర్‌ఘాట్‌లోని ముసానగర్, రసూల్‌పురా, శంకర్‌నగర్ ఏరియాలో మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను అధికారులు కూలుస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. సడెన్‌గా ఇళ్లు కూలిస్తే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు గచ్చిబౌలిలో నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని కూల్చివేశారు.
కూల్చివేతలను అడ్డుకుందాం..
ఇదిలా ఉంటే.. మూసీ ప్రక్షాళన బాధితుల వద్దకు వెళ్లిన కేటీఆర్ అక్కడ బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పెద్ద స్కాం అని ఆరోపించారు. 2,400 కిలోమీటర్ల గంగా ప్రక్షాలనకు కేంద్రం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే.. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు అవుతుందంటోందని పేర్కొన్నారు. ప్రక్షాళన వెనుక స్కాం ఉందని ఆరోపించారు. ముందుగా హుస్నేన్‌సాగర్ నాలాపై ఉన్న హైడ్రా కార్యలయాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలకు బుల్డోజర్లు వస్తే అడ్డుకోవాలని సూచించారు.