Khammam Crime : ఆటోలో తీసుకెళ్లి.. అత్యాచారం చేసి.. ఆసుపత్రిలో వదిలేశారు

ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది.

Written By: NARESH, Updated On : May 2, 2023 10:59 pm

khammam crime

Follow us on

Khammam Crime : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన అత్తకు సహాయకురాలిగా వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాష్టీకానికి ఒడిగట్టారు. కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి.. మరుసటి రోజు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన సదరు మహిళ చికిత్సపొందుతూ మృతి చెందింది. అయితే కుటుంబసభ్యుల తెలియనితనం.. పోలీసుల కాలయాపన కారణంగా ఆమె మృతదేహం మూడు రోజులుగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే ఉన్నది. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

అత్తను చూపించేందుకు వచ్చింది

వరంగల్‌ జిల్లా నెక్కొండ సమీపంలోని చెన్నారావుపేట మండలంలోని ఓ తండాకు చెందిన ఓ మహిళ (45) తన భర్తతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం పాలైన వృద్ధురాలైన తన అత్తకు ఖమ్మంలోని మమతా ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఈ నెల 27న నెక్కొండ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌రైల్లో ఉదయం ఖమ్మం చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌ నుంచి ఆటోలో మమతా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు మరో ఆటోలో ఖమ్మం కొత్త బస్టాండ్‌కు బయలుదేరారు. దారిమధ్యలో అత్త.. తనకు మూత్రం వస్తుందనడంతో ఆటోడ్రైవర్‌ ఓ నిర్జన ప్రాంతంలో ఆటోను ఆపాడు. అత్త కిందకు దిగి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లగా.. ఆటోలోనే ఉన్న సదరు మహిళను ఆటోడ్రైవర్‌ అపహరించాడు. ఆ తర్వాత కోడలి కోసం పలుచోట్ల వెదికిన అత్త సాయంత్రానికి ఖమ్మం రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఇంటికి వెళ్లింది. మరుసటి రోజైన 28వతేదీ ఉదయం ఆ వృద్ధురాలు కుటుంబసభ్యులకు ఖమ్మంలో జరిగిన విషయం చెప్పడంతో వారు ఖమ్మం వచ్చి పలుచోట్ల గాలించారు.

ఖమ్మం ఆసుపత్రి

ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు

ఈ క్రమంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో ఉన్న మహిళను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించగా సాయంత్రం ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు పలుచోట్ల ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఖమ్మంలోని పలు పోలీస్‌స్టేషన్లనకు వెళ్లారు. అయితే వారు ఘటన జరిగిన ప్రాంతం పేరు, వివరాలు సక్రమంగా చెప్పకపోవడంతో తమ పరిధి కాదంటూ పోలీసులు సమాధానమిచ్చారు. చివరకు మంగళవారం మధ్యాహ్నం ఖమ్మంలోని ఓ కాంగ్రెస్‌ నాయకుడి సహాయంతో సదరు మహిళ కుటుంబసభ్యులు ఖమ్మం టుటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పడంతో.. ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని చెప్పి.. తమ వద్ద ఉన్న ఫొటోను కుటుంబసభ్యులకు చూపించారు. దాంతో ఆమెను కుటుంబసభ్యులు గుర్తించి.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. గత నెల 28న ఉదయం గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో వచ్చి ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయాడని, అప్పటికే ఆమె అత్యాచారానికి గురైందని, తలకు తీవ్రగాయం కావడంతో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు.

రంగంలోకి ట్రైనీ ఐపీఎస్

వెంటనే సదరు మహిళ కుటుంబసభ్యులు మళ్లీ టుటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడ ఎస్‌హెచ్‌వోగా విధుల్లో ఉన్న ట్రెయినీ ఐపీఎస్‌ అవినాష్‌కుమార్‌కు విషయం చెప్పగా.. తక్షణమే స్పందించిన ఆయన అదనపు డీసీపీ సుభాస్‌చంద్రబోస్‌తో పాటు ఇతర పోలీసు అధికారులకు సమాచారమిచ్చి.. ఆయనే బాధితులను వన్‌టౌన్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో గుర్తుతెలియని ఆటోడ్రైవర్‌పై అత్యాచారం, హత్య, కిడ్నాప్‌ కేసులు నమోదుచేశామని నగర ఏసీపీ గణేష్‌ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా.. 28న ఉదయం మూడు గంటలపాటు ప్రభుత్వాసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది. నగరంలోని రహదారులపై ఉన్న మరికొన్ని సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఉదంతంలో సదరు ఆటోడ్రైవర్‌ ఒక్కడి ప్రమేయమే ఉందా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.