Atrocities At Gachibowli AIG Hospital: ఠాగూర్ సినిమా చూశారా.. అందులో చనిపోయిన వ్యక్తిని ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు చిరంజీవి. డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు.. అతడు బతకాలని ఆస్పత్రి వారిని కోరతాడు. డబ్బు ఎంతైనా పెట్టే సామర్థ్యం ఉండడంతో అతని దగ్గర నుంచి అందినంత కాడికి దండుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం భావిస్తుంది. అతడికి లేనిపోని మాటలు చెప్పిస్తుంది. అంతేకాదు అతడికి వైద్యం చేయించడానికి చాలా ఖర్చవుతుందని డబ్బులు వసూలు చేస్తుంది. చివరికి వారి బండారం చిరంజీవి బయటపెడతాడు.. దీంతో ఆ ఆస్పత్రి సీజ్ అవుతుంది.
అది సినిమా కాబట్టి ఆసుపత్రి సీజ్ అవుతుంది. కానీ నిజ జీవితంలో ఇలా డబ్బులు వసూలు చేసిన ఏ ఆసుపత్రి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. పైగా ఆ ఆస్పత్రులకు ఉన్న మనీ పవర్ వల్ల ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు. కానీ నేటి కాలంలో సోషల్ మీడియా విపరీతమైన వాడకంలో ఉంది కాబట్టి ఇటువంటి విషయాలు త్వరగానే వెలుగులోకి వస్తున్నాయి.. అటువంటి దారుణమే ఇప్పుడు ఒకటి చోటుచేసుకుంది. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినప్పటికీ.. సోషల్ మీడియా దానిని వెలుగులోకి తెచ్చింది. ఆ ఆసుపత్రి బండారాన్ని బయటపెట్టింది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ పేరుతో అతిపెద్ద ఆసుపత్రి ఉంది. ఇక్కడ అనేక రోగాలకు ప్రపంచ స్థాయి వైద్యం లభిస్తుంది. వైద్యులు కూడా అదే స్థాయిలో ఉంటారు కాబట్టి.. ఈ ఆసుపత్రికి భారీగా రోగులు వస్తుంటారు. ఏఐజి ఆసుపత్రికి ఉన్న పేరును దృష్టిలో పెట్టుకొని ఓ వ్యక్తి వచ్చాడు. అతని లివర్ దారుణంగా దెబ్బతిన్నది. దానిని మార్చాలని వైద్యులు చెప్పడంతో ఏఐజి ఆసుపత్రికి వచ్చాడు. కాలేయాన్ని మార్చేందుకు దాదాపు 85 లక్షల వరకు బిల్ అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు పూర్తిగా డబ్బు చెల్లించారు. అయితే అతని బతికించుకోవడానికి ఇల్లును కూడా విక్రయించారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బును ఆసుపత్రికి చెల్లించారు. కాలేయం మార్చి అతడిని బతికించాల్సిన ఆసుపత్రి వైద్యులు.. అతడికి మరణ శాసనాన్ని రాశారు. దీంతో అతడు లివర్ మార్పిడి జరగకుండానే కన్నుమూశాడు. పైగా ఆ వ్యక్తి గడిచిన రెండు రోజుల క్రితమే కన్నుమూశాడు.
పూర్తిస్థాయిలో డబ్బులు రాబట్టుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యం అతడి మరణాన్ని దాచి పెట్టింది.. ₹85 లక్షల బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత .. అతడి శవాన్ని వారి చేతుల్లో పెట్టింది. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరిగినప్పటికీ ఏ మీడియా సంస్థ కూడా దీనిని వార్తలాగా ప్రసారం చేయలేదు. సోషల్ మీడియా వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్. పేషంట్ కు రూ.35 లక్షలకు Liver Transplantation చేస్తామని చెప్పి రూ.85 లక్షల బిల్ వేసిన ఆసుపత్రి వైద్యులు. వేరే దారి లేక ఇల్లు అమ్మి మరీ బిల్ కట్టిన పేషంట్ కుటుంబ సభ్యులు. బిల్ కట్టాక పేషంట్ మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు. అయితే… pic.twitter.com/Bb2awXESPJ
— Tharun Reddy (@Tarunkethireddy) October 12, 2025