Atrocity In Hanamkonda: నేటి కాలంలో యువత భావోద్వేగాలను నియంత్రించుకోవడం లేదు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో పిల్లలకు జీవితం మీద అవగాహన ఉండడం లేదు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుండడం వల్ల పిల్లలతో మనసు మాట్లాడేవారే కరువు అవుతున్నారు. పైగా నేటి కాలంలో కార్పొరేట్ విద్య ను తమ పిల్లలకు అందించాలనే తాపత్రయం తల్లిదండ్రులలో పెరిగిపోతోంది. అందుపల్లే పిల్లల్ని తమకు దూరంగా.. హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు.
హాస్టల్లో ఉంటున్న పిల్లలు ఆత్మ న్యూనత భావానికి గురవుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు. పైగా చిన్న చిన్న సమస్యలకే అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు కన్న వాళ్లకు విపరీతమైన శోకాన్ని.. ఇటు స్నేహితులకు విపరీతమైన ఆవేదనను మిగులుచుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. విద్యార్థులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. ఒత్తిడిని తట్టుకోలేక దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఎలుకతుర్తి మండలం గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కృష్ణాకర్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె పేరు కీర్తన (19). ఆమె బిటెక్ చదువుతోంది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమె ఇటీవల కాలంలో తీవ్రమైన ఒత్తిడికి గురైంది. అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని తల్లిదండ్రులతో చెప్పుకునేది. తను హాస్టల్లో ఉండలేకపోతున్నానని చెప్పేది. దీంతో వారు ఆమెను వేరే కాలేజీలో చేర్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో కీర్తన దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణాకర్ ఉరివేసుకున్న కుమార్తెను దించి.. ఆస్పత్రి కి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో కృష్ణ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
నేటి కాలంలో కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న పిల్లలు తరచూ ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలపై ఉంది. ఇదే సమయంలో తమ పిల్లల్లో ఇలాంటి మార్పులను గమనించిన తల్లిదండ్రులు కచ్చితంగా యాజమాన్యం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. అది కూడా సాధ్యం కాకపోతే తామే స్వయంగా వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. అవసరమైతే వేరే కోర్సులలో చేర్పించే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తే ఇదిగో ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.