BRS: కరీంనగర్ జిల్లాలో భూకబ్జాలు, ఇతర నేరారోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. పక్షం రోజుల వరకు 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. దీంతో అరెస్టులు ఆగాయని అందరూ భావించారు. కానీ, సీపీ అభిషేక్ మహంతి బుధవారం(ఫిబ్రవరి 28న) మరో ముగ్గురిని ఒకేసారి అరెస్టు చేసి.. అక్రమార్కులను వదిలేది లేదని చెప్పకనే చెప్పారు.
కుప్పలుగా ఫిర్యాదులు..
బీఆర్‌ఎస్ హయాంలో భూ కబ్జాలకు పాల్పడినవారిపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సీపీకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన ప్రత్యేక దర్యాప్తు వింగ్ ఏర్పాటు చేసి మరీ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు. ఆధారాలు లభించగానే అరెస్టు చేస్తున్నారు. సీపీ దూకుడుతో బీఆర్‌ఎస్ నేతల బాధితులు కమిషనరేట్‌కు క్యూ కడుతున్నారు. దీంతో ఫిర్యాదులు కుప్పలుగా వస్తున్నాయి. మొదట కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావులను అరెస్ట్ చేశారు. నిమ్మశెట్టి శ్యాంపై కేసు నమోదు చేశారు. తర్వాత తీగలగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్యను అరెస్టు చేశారు. తర్వాత మాజీ మంత్రి, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరుడు తోట శ్రీపతిని కూడా భూకబ్జాల కేసులో అరెస్టు చేశారు. వీరితోపాటు పలువురు చోటామోటా లీడర్లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
తాజాగా మరో ముగ్గురు..
పక్షం రోజులుగా అరెస్టులు లేకపోవడంతో నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో సీపీ అభిషేక్ మహంతి బుధవారం(ఫిబ్రవరి 28న) ఒక్కరోజే ముగ్గురిని కటకటాల వెనక్కి పంపించారు. భూ కబ్జాలు.. నకిలీ డాక్యుమెంట్ల తయారీకి పాల్పడ్డ నేరారోపణల్లో కిసాన్‌నగర్ కార్పొరేటర్ ఎడ్ల సరిత భర్త, మాజీ మంత్రి గంగుల కమలాకర్ రైట్‌హ్యాండ్ ఎడ్ల అశోక్, తీగలగుట్టపల్లి కార్పొరేటర్ రాజేశ్వరి భర్త తుల బాలయ్య, మరో కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.