https://oktelugu.com/

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ!?

ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టేందుకు ఫోన్లు ట్యాపింగ్‌ చేసి తెలుసుకోవడంతోపాటు ప్రజలను ప్రలోభ పెట్టడానికి భారీస్థాయిలో నగదు తరలించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Written By: , Updated On : April 3, 2024 / 01:24 PM IST
Phone Tapping Case

Phone Tapping Case

Follow us on

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఇక దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసులే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డబ్బులు తరలించినట్లు రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రాధాకిషన్‌రావు ఇటీవల విచారణలో వెల్లడించారు. దీంతో ఈడీ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా డబ్బులు తరలించిన వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును టేకప్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లెక్కల్లోకి రాని డబ్బు ఒక చోట నుంచి మరో చోటుకు తరలిపోవడంతో ఇది ఎవరికి చెందినది అనేది ఆసక్తికరంగా మారింది.

పరికరాల కొనుగోలుపైనా..
అంతే కాకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేసినట్లు ప్రణీత్‌రావు అంగీకరించారు. దీంతో దీనికి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు అనే విషయంపైనా ఈడీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. దీంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుందని తెలుస్తోంది.

డబ్బు ఎక్కడిది.. ఎంత ఇచ్చారు?
ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టేందుకు ఫోన్లు ట్యాపింగ్‌ చేసి తెలుసుకోవడంతోపాటు ప్రజలను ప్రలోభ పెట్టడానికి భారీస్థాయిలో నగదు తరలించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు స్వయంగా రాధాకిషన్‌రావు సైతం చెప్పడంతో డబ్బులు సమకూర్చిన వారు ఎవరు. ఆ డబ్బులు ఎవరికి చేరవేశారు. ఎంత మొత్తం తరలించారు. ఆ డబ్బు ఎక్కడిది అనే వివరాలను ఈడీ తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరి మెడకు చుట్టుకుంటుందో..
ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు మొదలైంది. ప్రధానంగా నాటి ముఖ్యమైన మంత్రిగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈవ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్‌ సైతం ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ కేసులో పెద్దతలలు విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తినడం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్‌ చేశారు. ఈ క్రమంలో అక్రమంగా నగదు సరఫరా, హవాలా మార్గంలో తరలింపు అంశాలపై ఈడీ దర్యాప్తు చేసడితే ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళన గులాభీ నేతల్లో కనిపిస్తోంది.

రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌ ఆధారంగా..
ఇక ఈడీ మాజీ పోలీస్‌ అధికారి రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌నే ఆధారంగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈడీ ఎంటర్‌ అయితే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇరుకున పడే అవకాశం ఉంది. లోతుగా దర్యాప్తు చేస్తే డబ్బు సమకూర్చినవారు, దానిని అందుకున్నవారు సైతం చిక్కుల్లో పడడం ఖాయం. ఇదే సమయంలో ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలుకు డబ్బులు ఇచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి ఇచ్చారు. విదేశాలకు ఎవరు వెళ్లారు అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.