Basara IIIT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో డెత్ బెల్స్ మోగుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. ఈనెల 12న పీయూసీ–1 విద్యార్థిని దీపిక బాత్‌రూంలో ఉరేసుకుంది. తాజాగా ఈనెల 15న పీయూసీ–1 విద్యార్థిని నిఖిత అనుమానాస్పదంగా మృతిచెందింది. మొత్తంగా ఏడాది వ్యవధిలో నలుగురు విద్యార్థులు వివిధ కారణాలతో మృతిచెందడం చర్చనీయాంశమైంది. మరోవైపు తల్లిదండ్రులను వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్సిటీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
రాలిన మరో విద్యాసుమం..
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన నిఖిత(17) బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ–1 చదువుతోంది. గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తుపైనుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఫోన్ చూస్తూ నాలుగో అంతస్తు పైనుంచి పడి..
అయితే నిఖిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ఫోన్‌లో యూట్యూబ్ చూస్తూ ఏమరుపాటుగా భవనంపైనుంచి పడిపోయినట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ ఘటన ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వర్సిటీలో ఏం జరుగుతోంది..
మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మరణించడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. అసలు వర్సిటీలో ఏం జరుగుతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీపిక పరీక్షకు సెల్‌ఫోన్ తెచ్చిందని, ఆమెను మందలించడంతో బాత్‌రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెబుతున్నారు. ఇక నిఖిత ఫోన్ చూస్తూ కిందపడిపోయిందంటున్నారు. కానీ, వర్షిటీలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యాపకులు వేధిస్తున్నారని పలువురు అనుమానిస్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేకనే విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. కారణం ఏదైనా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు రాలిపోవడం బాధాకరం.