Khammam BRS Meeting: ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదుల కొద్దీ బస్సుల్లో ప్రజలు వచ్చారు.. ఆంధ్ర ప్రదేశ్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వారంతా కూడా ఖమ్మం సభకు హాజరయ్యారు. అయితే సభ వేదిక ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. వారి వెనకే తెలంగాణ ప్రజలను కూర్చోబెట్టారు.. దీంతో ముక్కున వేలేసుకోవడం తెలంగాణ ప్రజలవంతయింది.

వాస్తవానికి సభను మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించాల్సి ఉండగా… కొంచెం ముందుగానే మొదలుపెట్టారు.. కానీ అప్పటికే ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల బస్సుల్లో వచ్చారు.. జన సమీకరణ వెనుక కూడా వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నట్టు సమాచారం. ఎలాగైనా సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రజలను ఖమ్మం తరలించినట్లు తెలుస్తోంది. వచ్చిన ప్రజలకు అక్కడే ఆహారం, ఇతర ఏర్పాట్లు చేశారు.. అదే తెలంగాణ ప్రజలకు మాత్రం ఎటువంటి ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ వారు కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.

ఆంధ్ర ప్రాంత ప్రజలకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.. గతంలో వీరిపైనే కదా తాము ఉద్యమం చేసింది, మళ్లీ ఇప్పుడు వీరి పెత్తనం ఏంటని చర్చించుకున్నారు. ఇక పార్కింగ్ పాయింట్లలో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన బస్సులకు కలెక్టరేట్ వెనుక ప్రాంతాన్ని కేటాయించారు. ఇక తెలంగాణ బస్సులు కొన్నింటిని పోలీసులు ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లోనే ఆపేశారు. పైగా ప్రసంగంలో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించిన కేసీఆర్… తెలంగాణ ప్రాంత సమస్యల గురించి మాట్లాడకపోవడం గమనార్హం.. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన పార్టీ… తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన పార్టీలో… నేటి తెలంగాణ వాదమే కనిపించకపోవడం మారిన రాజకీయ ప్రయోజనాలకు నిదర్శనంగా కనిపించిందని సభకు హాజరైన మేధావులు చర్చించుకోవడం గమనార్హం.
ఇక ప్రజలను తరలించేందుకు హైదరాబాదులో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ఆంధ్ర ప్రాంతవాసులు బస్సులు సమకూర్చారు. వారికి కావాల్సిన భోజనం ఏర్పాట్లు కూడా సమకూర్చారు..