KCR- Harish Rao: ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు కర్త కర్మ క్రియ ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావే. గత పది రోజుల నుంచి ఆయన తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఖమ్మంలోనే మకాం వేశారు. స్థానిక నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను చేయించారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు ఆయన వీ. వెంకటాయపాలెం లోనే ఉన్నారు.. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు తో మాట్లాడి సభలో పాల్గొనేలా చేసిన ఘనత మాత్రం హరీష్ రావుకే దక్కుతుంది.. వాస్తవానికి ఇలాంటి సభలను విజయవంతం చేయడంలో హరీష్ రావు ది మొదటి నుంచి అందె వేసిన చేయి. ఉద్యమం నాటి నుంచి ఆయన ఈ ధోరణి కొనసాగిస్తున్నారు.. అయితే హరీష్ పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలం గురించి ఆలోచిస్తే… తక్కువే అని చెప్పాలి.

2018 ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కెసిఆర్ కేటీఆర్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడి ని చేశారు. ఇదే సమయంలో పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యం తగ్గించారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కెసిఆర్ మనసు మార్చుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హరీష్ రావుకు కీలక శాఖలు అప్పగించారు. ఆయన కూడా ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు.. ఈ క్రమంలోనే ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేసే బాధ్యతను హరీష్ రావు కేసీఆర్ అప్పగించారు.. ఆయన చెప్పినట్టుగానే క్షేత్రస్థాయిలో హరీష్ రావు కీలకంగా శ్రమించారు.. కానీ ఇటువంటి బహిరంగ సభలకు సంబంధించి ఇంతవరకు కేటీఆర్ ఏర్పాట్లను ఎన్నడు కూడా పర్యవేక్షించలేదు. గతంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో భారత రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్వహించినప్పుడు ఏర్పాట్లను కేటీఆర్ పర్యవేక్షించారు. కానీ అది పెద్ద భారీ బహిరంగ సభ కాదు. సభలకు హరీష్ రావును వాడుకొని… పేరు వచ్చే సందర్భంలో మాత్రం కేటీఆర్ ను కేసీఆర్ ముందు వరుసలో ఉంచుతారనే ఆరోపణలు ఉన్నాయి.

ఖమ్మం సభలో అన్ని తానయి
ఇక ఈరోజు జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భాసభలో హరీష్ రావు అన్ని తానయి వ్యవహరించారు.. సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు. జన సమీకరణలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నాయకులను సమన్వయం చేశారు.. కెసిఆర్ అనుకున్నంత స్థాయిలో జనం రాకపోయినప్పటికీ.. సభ చివరిలో హరీష్ రావు కృషిని కెసిఆర్ అభినందించలేకుండా ఉండలేకపోయారు..
ఇదే సమయానికి మంత్రి కేటీఆర్ దావోస్ లో ఉన్నారు.. వాస్తవానికి ఇలాంటి పెద్ద కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా ఆయన హాజరు అయితే బాగుండేది.. అయితే ఆయన పాత్రను హరీష్ రావు పోషించిన నేపథ్యంలో… భవిష్యత్తులో కాబోయే కార్యనిర్వాక అధ్యక్షుడు హరీష్ రావే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.