https://oktelugu.com/

ABN Andhra Jyothi: అనుకూల ప్రభుత్వం వచ్చినా.. దమ్మున్న పత్రికలో ఇంక్రిమెంట్లు లేవా?

వాస్తవానికి ఆంధ్రజ్యోతి కంటే సాక్షి, నమస్తే తెలంగాణలో పనిచేసే ఉద్యోగుల జీతాలు కాస్తో కూస్తో నయం. మొన్నటిదాకా అధికార పత్రికగా దర్పం వెలగబెట్టిన నమస్తే తెలంగాణలో ఉద్యోగులు తమ జీతాల పెంపుదల కోసం నిరసన చేపట్టారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 11:09 AM IST
    Follow us on

    ABN Andhra Jyothi: ఖర్చులు పెరుగుతున్నాయి. పెట్రోల్ నుంచి ఇంటి ఖర్చుల దాకా ఆకాశాన్నంటుతున్నాయి. చాలామందికి వచ్చే ఆదాయానికి, అయ్యే ఖర్చుకు లంకె కుదరడం లేదు. ఇక ఈ జాబితాలో జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణం.. ఇలాంటి పరిస్థితుల్లో వారికి యాజమాన్యాలే అండగా ఉండాలి. మార్కెట్ ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచాలి. ప్రస్తుతం ఉన్న ప్రింట్ మీడియాలో ఒక ఈనాడు మిగతా పత్రికలది అదే దారి. గొడ్డు చాకిరి చేయించుకోవడం అత్తెసరు జీతాలు ఇవ్వడం పరిపాటి. ఇక ఈ జర్నలిజం అనేది ఒక వ్యసనం కాబట్టి చాలామంది ఇందులో నుంచి బయటికి వెళ్లలేరు. ఇక తెలుగునాట దమ్మున్న పత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతిలో ఇంతవరకు ఇంక్రిమెంట్లు పడలేదని తెలుస్తోంది. గత ఏడాది యాజమాన్యం అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్లు వేసింది. అంతకుముందు కోవిడ్ ఏడాదిలో సగానికంటే ఎక్కువ మంది ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించింది. అంతేకాదు కోవిడ్ వచ్చి చాలామంది మరణించినప్పటికీ తన బాధ్యతగా కనీసం ఒక్క రూపాయి కూడా బాధిత కుటుంబాలకు పరిహారంగా ఇవ్వలేదు. కానీ దాని ఓనర్ వేమూరి రాధాకృష్ణ మాత్రం బయటికి చాలా నీతులు చెబుతాడు. తనది దమ్మున్న పత్రిక అని.. నిజాలు నిర్భయంగా చెబుతానని వీరలెవల్లో ప్రచారం చేసుకుంటాడు.

    వాస్తవానికి ఆంధ్రజ్యోతి కంటే సాక్షి, నమస్తే తెలంగాణలో పనిచేసే ఉద్యోగుల జీతాలు కాస్తో కూస్తో నయం. మొన్నటిదాకా అధికార పత్రికగా దర్పం వెలగబెట్టిన నమస్తే తెలంగాణలో ఉద్యోగులు తమ జీతాల పెంపుదల కోసం నిరసన చేపట్టారు. చివరికి యాజమాన్యాన్ని తమ కాళ్ల దగ్గరికి తెచ్చుకున్నారు. కానీ ఆంధ్రజ్యోతిలో ఆ స్వేచ్ఛ కూడా ఉండదు. ఎందుకంటే పై స్థాయిలో మొత్తం కూడా ఒక సామాజిక వర్గం వారే ఉంటారు. చివరికి డిగ్రీ కూడా పాస్ కానీ బ్రాంచ్ మేనేజర్లు ఎదుటోడియల్ లో కూడా వేలు పెడతారు. ఏ వార్త ఎంతలా ఉండాలి, ఏ ప్లేస్ లో ఉండాలో కూడా వారే డిసైడ్ చేస్తారు. ఇక అందులో పనిచేసే సిబ్బంది తిట్టుకుంటూనే ఆ పని పూర్తి చేస్తారు.

    ఇక కోవిడ్ టైంలో అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించిన రాధాకృష్ణ.. చాలావరకు భారాన్ని తొలగించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఆంధ్రజ్యోతిలో ప్రస్తుతానికి 1000 కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వినికిడి. అయితే ఇందులో సెంట్రల్ డెస్క్ మినహా (మిగతా పత్రికలతో పోలిస్తే తక్కువ) మిగతా అన్ని విభాగాల్లో గొర్రె తోక బెత్తెడు జీతాలే. అయినప్పటికీ రాధాకృష్ణ మనసు కరగదు. కోవిడ్ సమయంలో ఇచ్చే జీతంలోనూ 30% కోత విధించారు. ఆ తర్వాత దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇక ఒక ఏడాది పాటు ఇంక్రిమెంట్ అనే ఊసు కూడా ఎత్తలేదు. మరుసటి ఏడాది అందరికీ 1000 రూపాయలు పెంచారు. ఆ తర్వాత బేసిక్ మీద 10% హైక్ ఇచ్చారు. అది కూడా గత ఏడాది అక్టోబర్లో. ఇక ఏడాది ఎన్నికలు జరిగాయి. జిల్లాల్లో పెయిడ్ ఆర్టికల్స్ పేరుతో భారీగానే వెనకేశారు. స్థూలంగా ఒక్కొక్క జిల్లా నుంచి రెండు కోట్ల పైచిలుకు నగదు యాజమాన్యానికి చేరిందని టాక్. అయినప్పటికీ ఉద్యోగుల జీతాలు పెంచడానికి రాధాకృష్ణకు మనసొప్పడం లేదు. ఉద్యోగులు కూడా మొన్నటి ఎన్నికల్లో కనీసం వీక్లీ ఆఫ్ లు కూడా తీసుకోకుండా పనిచేశారు. గతంలో పెయిడ్ ఆర్టికల్స్ పై డెస్క్ లో పనిచేసేవానికి కమిషన్ లు ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా లేదని వినికిడి. నల్లగొండ ఎడిషన్ లో మాత్రం ఒక్కో సబ్ ఎడిటర్ కి 10,000 ఇచ్చారని తెలుస్తోంది.. కానీ మిగతా జిల్లాల్లో ఆ పరిస్థితి కూడా లేదని సమాచారం. అక్కడ బ్రాంచ్ మేనేజర్లను సబ్ ఎడిటర్లు అడిగితే మా చేతిలో ఏమీ లేదు, మొత్తం మేనేజ్మెంట్ దే తుది నిర్ణయమని చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.

    అయితే పై స్థాయిలో వ్యక్తులు మాత్రం వచ్చే నెలలో ఇంక్రిమెంట్లు వేస్తారని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంచెం మెరుగ్గానే ఉంటుందని అంటున్నారట. సగం మంది ఉద్యోగులను తొలగించడం, జిల్లా అనుబంధాలు ఎత్తేయడం వల్ల ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ కు ఖర్చు సగానికి సగం తగ్గింది. అయినప్పటికీ ఇంక్రిమెంట్ వేయడంలో రాధాకృష్ణకు మనసు ఒప్పడం లేదు. తనది దమ్మున్న పత్రికగా చెప్పుకునే అతను.. ఇంక్రిమెంట్ విషయంలో ఆ దమ్ము ఎందుకు చూపించడో అంతు చిక్కని విషయం. అన్నట్టు సంవత్సరాలకు సంవత్సరాలు చాకిరి చేస్తున్నా జిల్లా కేంద్రాల్లో పని చేసే సిబ్బంది జీతాలు 30 వేల లోపే ఉండటం రాధాకృష్ణ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ కు చిన్న ఉదాహరణ. సబ్ ఎడిటర్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రిపోర్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వారిని యాడ్స్ రిప్రజెంటీటివ్, సర్టిఫిషర్ స్టాఫ్ గా మాత్రమే వాడుకుంటున్నారు.. వారికి అందులో కొంత కమిషన్ ఇచ్చి.. లైన్ ఎకౌంట్ కు ఎప్పుడో మంగళం పాడేశారు. మీడియా ముసుగులో ఇలా చేస్తున్న వ్యక్తుల మీద మన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. తీసుకోలేవు కూడా. ఎందుకంటే ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు.