Ande Sri History: అందెశ్రీ.. తెలంగాణతనానికి నిలువెత్తు ప్రతీక. పోరాటానికి.. ధిక్కారానికి అసలైన చిరునామా. తన చిన్నతనం నుంచి తుది శ్వాస వరకు అందెశ్రీ అదే పోరాటతత్వాన్ని ప్రదర్శించారు. అదే తిరుగుబాటుతనాన్ని కొనసాగించారు.. అందువల్లే ఆయన పాటల్లో ధిక్కారం కనిపిస్తుంది. పోరాటం ప్రతి ధ్వనిస్తుంది.. సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో తుది శ్వాస విడిచిన అందెశ్రీ (64) తన జీవితం మొత్తం పోరాట బాటను కొనసాగించారు.
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు , కుమారుడు సంతానం. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జయ జయహే తెలంగాణ ను అందెశ్రీ రూపొందించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ సాధించారు. ఆశు కవిత్వంలో అందెశ్రీకి విపరీతమైన పట్టు ఉంది. “పల్లె నీకు వందనాలమ్మా”, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” అనే పాటలను ఆయన రచించారు. ఈ పాటల ద్వారా ప్రజాకవిగా గుర్తింపు పొందారు. అందెశ్రీ అద్భుతంగా పాటలు రాశాడు కాబట్టి.. ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయలు అందించింది.
అందెశ్రీ చిన్నతనంలో గొడ్ల కాపరిగా పనిచేసేవాడు. శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహరాజ్ అందెశ్రీలో ఉన్న ప్రతిభను గుర్తించారు. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు కల్పించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఆర్ నారాయణమూర్తి తీసే విప్లవ సినిమాల ద్వారా స్ఫూర్తి పొంది.. ఆ తరహాలోనే గేయాలు రాశారు. పాటలను రూపొందించారు. తన కవిత్వంలో తెలంగాణ ఆత్మను.. ప్రకృతిని ఉండేలా చూసుకున్నారు. 2006లో గంగా సినిమాకు గాను ఆయన నంది పురస్కారం అందుకున్నారు.. అందెశ్రీ కి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.. ఆయన పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లలో కులం ఉండదు. మతం అంతకన్నా ఉండదు. అందెశ్రీ తన చిన్నతనంలో పడిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణాన్ని వినేవారు. యక్షగానాలు, కోలాటాలలో మునిగితేలేవారు. పశువుల కాపరిగా జీతం ఉన్నప్పుడు తెల్లవార్లు మోటా తోలేవారు. ఆ సమయంలోనే పనిని బట్టి పాటను అల్లుకునేవారు. అదేపనిగా పాడేవారు. అలవోకగా పాటలకు బాణీలు కట్టేవారు. కూలి పని నుంచి మొదలు పెడితే తాపీ మేస్త్రి పని వరకు దేనిని వదిలిపెట్టకుండా అందెశ్రీ చేశారు. చేసే పనిలో ఆనందం వెతుక్కున్నారు..
బువ్వ లేకుండా బతుకును సాగించాడు. దుఃఖపూరితమైన జీవితాన్ని గడిపాడు. జీవితాన్ని వడ్డించిన విస్తరి కాకుండా.. నెత్తుటి గాయాల తీరుగా కొనసాగించాడు.. తిరగబడనోడు గొప్ప కవి కాదు అంటూ చెప్పినా ఆయన కనీసం కవి కూడా కాలేడని పేర్కొన్నాడు. లొంగిపోవద్దని.. వంగిపోవద్దని.. అలాంటి జీవితం జీవితం జీవితం కానే కాదని కుండబద్దలు కొట్టాడు. జై బోలో తెలంగాణ.. జన గర్జనలా జడివాన అని తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాట పాడితే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఊగిపోయింది. జోకుడు పాటలు కాకుండా.. ఉద్యమ గేయాలను రచించి ప్రజాకవిలాగా.. ప్రభా రవి లాగా వెలుగొందాడు అందెశ్రీ.