RK Kothapaluku: 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడింది.. దీంతో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే( ఆరోజు ఆదివారం) రాధాకృష్ణ రాయల్సి ఉండే. కానీ ఎందుకనో ఆగిపోయాడు. బహుశా సంబరాల్లో మునిగిపోయాడు కావచ్చు. ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత అప్పట్లో కొత్త పలుకు రాశాడు. ఏకంగా కెసిఆర్ కు అహంకారం అనే ట్యాగ్ లైన్ తగిలించాడు. మళ్లీ గత ఆదివారం కేసీఆర్ అహంకారమే ట్యాగ్ లైన్ గా తీసుకున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాడు అని రాసుకొచ్చాడు. అయితే ఈ ఆదివారం తన కొత్త పలుకులో ఎలాంటి విషయాలు చెబుతాడోనని ఆసక్తి పాఠకుల్లో ఉండేది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాధాకృష్ణ కొత్త పలుకు రాయలేదు. తెలంగాణలో ఇప్పుడు పెద్దగా రాయడానికి ఏమీ లేదు అనుకున్నాడా? లేక ఆంధ్రప్రదేశ్లోనూ అనుకున్న ప్రభుత్వం ఏర్పడటానికి తెరవెనుక కసరత్తు చేస్తున్నాడా?
వాస్తవానికి తెలంగాణలో ప్రస్తుతం అనేక కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. బియ్యానికి సంబంధించి అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటు, ఇంకా రకరకాల వ్యవహారాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు తెలుస్తోంది. ఇలాంటప్పుడు అలాంటి వాటి విషయాలను బహిరంగం చేయాల్సిన బాధ్యత రాధాకృష్ణపై ఉంది. పైగా రేవంత్ రెడ్డి ఇతడికి అత్యంత ఇష్టమైన వ్యక్తి కూడా.. కానీ ఇలాంటి కీలక సమయంలో రాధాకృష్ణ కొత్త పలుకు రాయలేదు.. ఇక అటు ఏపీలో కూడా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార వైసిపి నుంచి ప్రతిపక్ష టీడీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు పసుపు పచ్చ కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్ళురుతున్నారు. ఇక అక్కడ ప్రభుత్వం చేసిన పనులు వివాదాస్పదమవుతున్నాయి. ఈ క్రమంలో వాటిని తన కొత్త పలుకు ద్వారా జనంలోకి మరింత విస్తృతంగా తీసుకొస్తారని టిడిపి నాయకులు భావించారు. కానీ ఈ ఆదివారం రాధాకృష్ణ కొత్త పలుకు రాయకపోవడంతో తెర వెనుక ఏమైనా జరిగిందా, లేక రాధాకృష్ణ ఈ ఆదివారం విశ్రాంతి తీసుకుంటున్నాడా అనే ప్రశ్నలను టిడిపి నాయకులు తమలో తామే సంధించుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు రాధాకృష్ణ మాములు పోరాటం చేయలేదు. తన పత్రిక ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసిన వార్తల ఆధారంగానే టిడిపి నాయకులు మరింత ఉధృతంగా జగన్ ప్రభుత్వం పై పోరాటాలు చేశారు.. అయితే ఈసారి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రాధాకృష్ణ తన కొత్త పలుకు ద్వారా దానిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి కీలక సమయంలో కొత్త పలుకును రాధాకృష్ణ రాయకపోవడం పట్ల వారు ఒకింత నిర్వేదం చెందుతున్నారు.
వాస్తవానికి రాధాకృష్ణ కొత్త పలుకు చంద్రబాబు ప్రస్తావన లేకుంటే చాలా బాగుంటుంది. ఆఫ్ ది రికార్డ్ విషయాలను రాధాకృష్ణ రెండవ మాటకు తావు లేకుండా రాసేస్తారు. అందులో ఎటువంటి మొహమాటాన్ని ప్రదర్శించరు. కవిత లిక్కర్ స్కాం ను రాధాకృష్ణ ఇదే కొత్త పలుకులో ప్రస్తావించారు. కెసిఆర్ కు సంబంధించిన అంతర్గత విషయాలను కూడా ఇలానే ఆయన బయట ప్రపంచానికి తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలో పలుమార్లు తన కొత్త పలుకు వ్యాసాల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అంటే రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? అనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు..కానీ అది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఒక ఆయుధంగా మారింది అనేది మాత్రం నిర్వివాదాశం. దమ్మున్న జర్నలిస్టుగా తనను తాను అభివర్ణించుకునే రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఎలా వత్తాసు పలుకుతాడు అనే సందేహం ఇక్కడ రావచ్చు.. దీనికి సరైన సమాధానం రాధాకృష్ణ నుంచి లభించకపోవచ్చు. కానీ ఒక బలమైన మాధ్యమం లేకపోతే ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. కాబట్టి దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాగని సర్కార్ చేసే తప్పులను కూడా గుడ్డిగా సమర్థిస్తే ఆంధ్రజ్యోతి కాస్త మరో నమస్తే తెలంగాణ అవుతుంది. కానీ రాధాకృష్ణ అక్కడ దాక తీసుకొస్తారని అనుకోవడానికి లేదు. ఏది ఏమైనప్పటికీ ఈవారం మాత్రం తెలుగు పాఠకులు ఈ వారం కొత్తపలుకు స్పైసీ నెస్ ను మిస్ అయ్యారు. మరి వచ్చేవారమైనా రాధాకృష్ణ రాస్తాడా? లేక ఈ విరామాన్నే కొనసాగిస్తాడా అనేది వేచి చూడాల్సి ఉంది.