Sarpanch Post Auction : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్(Notification) వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు కూడా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కూడా ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్నికలకు వెళ్లడం కన్నా.. గ్రామ అభివృద్ధి పేరిట పందవుకు వేలం కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా మావపాడు మండలంలో గోకులపాడు(Gokulapadu) సర్పంచ్ పదవికి వేలం నిర్వహించారు. వేలంలో బి.భీమరాజు(Bheema Raju) అనే వ్యక్తి రూ.27.60 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. ఈ వేలంలో నలుగురు పాల్గొన్నారు. వేలం విషయాన్ని ధ్రువీకరించిన గ్రామస్తులు ఈ విషయం బయటకు తెలియకుండా చూసుకుంటున్నారు.
ఎన్నికల నిర్వహణకే మొగ్గు..
అయితే ఎన్నికల సంఘం మాత్రం పంచాయతీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఏకగ్రీవాలకు తావులేకుండా ప్లాన్ చేస్తోంది. ఈమేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రైట్ నాట్ టు ఓట్(Right to Not Vote) ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాకు ఎంచుకునే హక్కు ఓటరుకు ఉంటుందని చెబుతోంది. కానీ ఏకగ్రీవాలతో ఈ అవకాశం లేకుండా పోతోంది. దీనిపై పబ్లిక్ నుంచి ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(Foram For Good Governance) కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రతీ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్లు నోటాను వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతీ ఓటరుకు ఉందని తెలిపింది.
నోటా అప్రకటిత అభ్యర్థిగా..
ఏకగ్రీవాలకు తావులేకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా ఉంచి ఓటింగ్ పెట్టాలని ఈసీ కూడా భావిస్తోంది. దీనిపై ఈనెల 12న అన్ని రాజకీయా పార్టీలతో సమావేశం నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్(State Election Commission) తెచ్చిన ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నాయి. అందరూ అంగీకరిస్తే నోటా కూడా అభ్యర్థిగా మారే అవకాశం ఉంది.