Also Read: కేసీఆర్ డిసైడ్.. దసరాకే ముహూర్తం?
షాపింగ్ మాల్స్ తెరుచుకోవడం.. మెట్రో సర్వీసులు ప్రారంభం కావడం.. సిటీ బస్సులు బస్సులూ రోడ్డెక్కడంతో నగరంలో ట్రాఫిక్ యథా స్థితికి చేరింది. మొన్నటి వరకూ తక్కువ వాహనాలతో చటుక్కున గమ్య స్థానాలకు చేరుకునే పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా తయారైంది. ప్రధాన కూడళ్లు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇన్నాళ్లు ట్రాఫిక్ బాధల నుంచి ఉప శమనం పొందిన వాహనదారులంతా తాజా పరిస్థితితో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి అంటూ తలలు బాదుకుంటున్నారు.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో అనేక వ్యాపార రంగాలు మూతబడ్డాయి. కొన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూసి శాశ్వతంగా రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. చాలా మంది చిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోడంతో అగమ్యగోచరంలో పడిపోయారు. ఏదైనా పనిచేస్తేనే గాని జీవించలేని పరిస్థితిలో ఉన్న అనేక మంది నగరాన్ని విడిచి సొంత గ్రామాలకు తరలి వెళ్లిపోయారు. 30 లక్షల వరకు జనాభా వెళ్లిపోయింది. దీంతో నగరం చాలా వరకూ ఖాళీగా కనిపించింది. రానురాను పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉపాధి లేక ఊరెళ్లిపోయిన వారు మళ్లీ సిటీకి చేరుకుంటున్నారు. పరిశ్రమలు, వ్యాపార కార్యక్రమాలు గాడిన పడుతుండడంతో ఉపాధి కోసం వస్తున్నారు.
Also Read: అంబటికి మంత్రి పదవి దక్కకుండా చేస్తున్నారా?
ఇటీవలే సిటీ బస్సులు కూడా ప్రారంభం కావడంతో రోడ్లన్నీ మళ్లీ జనసాంద్రతతో కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, పాట్నీ సెంటర్, బేగంపేట, పంజాగుట్ట, మైత్రీవనమ్, యూసఫ్ గూడ సర్కిల్, జూబ్లీ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, ఖైరతాబాద్, రవీంద్ర భారతి జంక్షన్, నాంపల్లి, కోటి తదితర కూడళ్లలో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తోంది. నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిన అనేక మంది జీవనోపాధికోసం మళ్లీ హైదరాబాద్ తలుపు తట్టడం నగరం యొక్క గొప్పతనం అర్థమవుతోంది.