https://oktelugu.com/

Medaram Jatara 2024: మేడారం భక్తులకు అలర్ట్‌.. జాతరలో జర జాగ్రత్త.. ఇవి మీ వెంట ఉండాలి..

అమ్మవార్లు కొలువైన ప్రదేశం అటవీ ప్రాంతం. జాతర సమయంలో చిట్టడవి కాస్త జనారణ్యంగా మారుతుంది. కోట్లాది మంది భక్తులు వస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 9, 2024 / 08:23 AM IST

    Medaram Jatara 2024

    Follow us on

    Medaram Jatara 2024: వన దేవతలు.. శక్తి స్వరూపిణిలు.. అడవి తల్లులైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సమీపిస్తోంది. మరో పక్షం రోజుల్లో జాతర మొదలవుతుంది. జాతర వేళ భక్తులు భారీగా తరలి వస్తారని ఇప్పటి నుంచే చాలా మంది మేడారం వెళ్లొస్తున్నారు. నిత్యం కనీసం లక్ష మంది అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో మేడారం వెళ్లే భక్తులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. జాతరకు కొన్ని వస్తువులతోపాటు ఈసారి కొన్ని పత్రాలు కూడా తీసుకెళ్లాలి. లేకుంటే జాతరలో ఇబ్బందులు తప్పవు.

    తెలంగాణ కుంభమేళా..
    ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. భారత దక్షిణ మహా కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన జాతరకు మేడారం సిద్ధమవుతోంది. ఇప్పటికే భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటుండడంతో మేడారం కిటకిటలాడుతోంది. ఈనెల 21వ తేదీ నుంచి 28 వరకు జాతర జరగనుండగా ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. రెండేళ్ల క్రితం కరోనా భయంతో భక్తులు తక్కువగా వచ్చారు. ఈసారి అలాంటిది లేకపోవడంతో కోటి మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జాతర జరిగే ప్రాంతం అడవి కావడంతో అటవీ అధికారులు భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. జాతరలో సమర్పించే నిలువెత్తు బంగారం విషయంలో ఎక్సైజ్‌ శాఖ కీలక ప్రకటన చేసింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో ఆర్టీసీ కూడా కీలక సూచనలు చేస్తోంది.

    ఆధార్‌ ఉంటేనే బంగారం మొక్కులు..
    మేడారం జాతరలో కీలకమైనది బంగారం(బెల్లం. అడవి తల్లులను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అటవీ ప్రాంతం కావడంతో బెల్లం విక్రయాలపై నిషేధం ఉంది. జాతరకు వచ్చే బెల్లాన్ని సారా వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే జాతర నేపథ్యంలో బెల్లం విక్రయాలపై ఆంక్షలను ఎక్సైజ్‌ శాఖ సడలించింది. అయితే ఒక కండీషన్‌ పెట్టింది. బంగారం సమర్పించేవారు తప్పకుండా ఆధార్‌ కార్డు చూపించాలి. దీంతో మేడారం వెళ్లే భక్తులు ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లాలి. భక్తుల నుంచి ఆధార్‌ జిరాక్స్, ఫోన్‌ నంబర్, ఇంటి చిరునామా తీసుకున్న తర్వాతనే బెల్లం విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

    ప్లాస్టిక్‌పై నిషేధం..
    అమ్మవార్లు కొలువైన ప్రదేశం అటవీ ప్రాంతం. జాతర సమయంలో చిట్టడవి కాస్త జనారణ్యంగా మారుతుంది. కోట్లాది మంది భక్తులు వస్తారు. దీంతో అటవీ ప్రాంతం కాలుష్యమవుతుంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ జాతరకు వచ్చే భక్తులు మాత్రం ప్లాస్టిక్‌ వాడొద్దని సూచిస్తోంది. జాతర ప్రాంతంలో తక్కువగా చెత్త ఉండేలా చూసుకోవాలని సూచిస్తోంది.

    ఆర్టీసీ కీలక ప్రకటన..
    మేడారం మహాజాతరకు ఆర్టీసీ ఈసారి మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పించింది. అయితే భక్తులు తప్పనిసరిగా ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు చూపించాలని స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డు లేనివారు బస్సులో టికెట్‌ తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ ఒరిజినల్‌ కార్డు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. అదే సమయంలో అడవికి నష్టం కలుగకుండా కొన్ని స్టీలు పాత్రలు, బట్ట సంచులు కూడా తీసుకెళ్లడం మంచిది.

    జంపన్న వాగు దగ్గర జాగ్రత్త..
    ఇక జాతరకు వెళ్లిన భక్తులు జంపన్న వాగు దగ్గర జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. వాగు ఒడ్డున ఉన్న షవర్ల వద్ద మాత్రమే భక్తులు స్నానాలు చేయాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న దయ్యాల వాగు, ఊరట్టం లోలెవల్, చింతల్‌ క్రాస్‌రోడ్‌ చెక్‌డ్యాం, పడిగాపూర్‌ ప్రాంతంలో ఈతకు దిగొద్దని సూచించారు.