OYO Hyderabad: అది హైదరాబాదులోని మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడ ప్రాంతం. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణం ఒకటి ఉంది. నిర్మాణంలోనే అపార్ట్మెంట్ తరహాలో రూపకల్పన చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఓ వ్యక్తి వచ్చి హాస్టల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాడు. అంతేకాదు ఆ భవన యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. హాస్టల్ ఏర్పాటు కాలేదు. కొద్దిరోజుల తర్వాత ఆ కాలనీవాసులు దిగ్బ్రాంతి చెందే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
హాస్టల్ పేరుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఆ వ్యక్తి ఓయో నిర్వాహకులకు భారీ ధరకు రెంటుకు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో లాడ్జీలు లేవు. పైగా కాలేజీ యువకులు అధికంగా ఉంటారు. యువతులు కూడా అదే స్థాయిలో ఉంటారు. వారికి ప్రైవసీ కావాలి.. ఏకాంతంగా గడిపే ఒక చోటు కావాలి. ఎవరూ ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛగా విహరించే విడిది కేంద్రం కావాలి. ఇవన్నీ ముందుగానే అంచనా వేసిన ఓయో నిర్వాహకులు దర్జాగా అక్కడ తమ వ్యాపారం మొదలుపెట్టారు. అసలే కాలేజీలు అధికంగా ఉన్న ఆ ప్రాంతం కావడంతో దర్జాగా వ్యాపారం మొదలైంది. కాలేజీ యువతీ యువకులు అక్కడికి రావడం ప్రారంభమైంది. రూములలో అరుపులు కేకలతో ఆ ప్రాంతం మొత్తం ఒక రకమైన వాతావరణం నెలకొంది.
గతంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఎప్పుడైతే అక్కడ ఓయో తన కార్యకలాపాలు మొదలు పెట్టిందో.. ఒకసారి గా ఆ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు కరువైంది.. అంతేకాదు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు విపరీతంగా జరుగుతూ ఉండడంతో కాలనీవాసులు నరకం చూస్తున్నారు.. అన్నోజి గూడ ప్రాంతంలోని సంస్కృతి టౌన్ షిప్ కు సమీపంలో హైదరాబాదులో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న అరుణ అనే మహిళ.. ఏపీ జెన్కోలో పనిచేస్తున్న ఆమె భర్త మోహన్ రావు ఈ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భవనాన్ని హాస్టల్ కోసం వెంకటేష్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. మూడు సంవత్సరాల పాటు కాల పరిమితి విధిస్తూ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.. వెంకటేశం అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు పొందకుండానే కాకతీయ పేరుతో హోటల్ ఏర్పాటు చేశాడు. అందులోనే ఓయో రూమ్ ల సౌకర్యం కూడా అందుబాటులో తీసుకొచ్చాడు. అయితే ఇక్కడికి పెళ్లి కాని జంటలు.. కాలేజీ యువతీ యువకులు.. ఉత్తర భారతదేశానికి చెందిన కొంతమంది యువతులు ఎక్కువగా వస్తున్నారు. వీరంతా కూడా ఆసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టు సమాచారం.
అర్ధరాత్రి పూట పుట్టినరోజు వేడుకల పేరుతో మద్యం తాగుతున్నారని.. మత్తు పదార్థాలు వినియోగిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికే మేడ్చల్ కలెక్టర్ మను చౌదరికి ఈ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఘట్కేసర్ మండల విద్యాధికారి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. అధికారులకు నివేదిక సమర్పించారు. ఈ భవనాన్ని సీజ్ చేయడానికి అధికారులు ప్రయత్నించగా.. రెండు రోజులు గడువు కావాలని నిర్వాహకులు కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ భవన యజమాని అరుణ మాత్రం కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా సరే అందులో కార్యకలాపాలు సాగుతాయని.. ఏం చేసుకుంటారో చేసుకోండనే దిశగా వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.