Hyderabad : ఒకప్పటిలాగా జనం లేరు. వెనుకటి కాలంలో లాగా అత్తెసరు జీవితాలు కాదు. అంతంత మాత్రం జీతాలు కాదు. డబ్బు సంపాదన పెరిగింది. హై ఎండ్ లైఫ్ స్టైల్ అలవాటయింది. తినే తిండి దగ్గర నుంచి.. తొడుక్కునే దుస్తుల దాకా ప్రతి విషయంలోనూ లగ్జరీ సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో డబ్బు ఖర్చుకు ఎవరూ వెనుకాడటం లేదు. ప్రతి విషయంలోనూ రిచ్ నెస్ చూపిస్తున్నారు. మారిన ప్రజల జీవన శైలికి అనుగుణంగానే కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని ఒకే చోట విక్రయించేందుకు షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతున్నాయి.. అయితే ఒకప్పుడు షాపింగ్ మాల్స్ అంటే ముంబై లేదా ఢిల్లీ ప్రాంతాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కాల క్రమం లో ఈ రెండు నగరాలు మరుగున పడ్డాయి. వాటి స్థానాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటైన షాపింగ్ మాల్స్ ఆక్రమించాయి.
శరత్ సిటీ క్యాపిటల్ మాల్
హైదరాబాదులో గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటైన శరత్ సిటీ క్యాపిటల్ మాల్ భారత దేశంలోనే అత్యధికంగా ప్రజల సందర్శించే టాప్ -25 మాల్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాను బెంగళూరు కేంద్రంగా పనిచేసే జియో ఐక్యూ అనే సంస్థ వెల్లడించింది.. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ను రోజుకు సగటున 19,105 మంది సందర్శిస్తారు. అత్యధికంగా ప్రజలు సందర్శించే షాపింగ్ మాల్స్ జాబితాలో శరత్ సిటీ క్యాపిటల్ మాల్ 9వ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 27 లక్షల చదరపు అడుగులు. 2017లో శరత్ గ్రూప్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ షాపింగ్ మాల్ ఏర్పాటయింది. షాపింగ్ మాల్ లో వందలాది సంస్థలు తమ బ్రాండ్లను విక్రయించేందుకు దుకాణాలను ఏర్పాటు చేశాయి. ఏషియన్ సినిమాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ.ఎం.బి సినిమాస్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లోనే ఉంది. ఇందులో సినిమాలు చూసేందుకు ప్రతిరోజు వందలాది మంది ప్రేక్షకులు వస్తూ ఉంటారు. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ రిటైల్ విస్తీర్ణం 19 లక్షల 13 వేల చదరపు అడుగులు. ఇది 8 ఫ్లోర్లతో ఉంది.
నెక్సస్ మాల్
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ తర్వాత కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ముంబైలోని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ దీనిని నిర్మించింది. ఇందులో కూడా సుప్రసిద్ధమైన బ్రాండ్లకు సంబంధించిన సంస్థలు విక్రయాలు సాగిస్తుంటాయి. దేశంలోనే ప్రసిద్ధమైన సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తుంటాయి. హైదరాబాద్ నగరం విస్తరించడం.. ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో.. ఈ షాపింగ్ మాల్స్ నిత్యం జనంతో కిటకిటలాడుతున్నాయి. అంతేకాదు వివిధ వేడుకలకు వేదికలుగా మారుతున్నాయి.. ఇక ఢిల్లీలోని వేగాస్ మాల్ రోజుకు సంఘటన 26,212 మంది సందర్శకులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో V3S ఈస్ట్ సెంటర్ మాల్ కొనసాగుతోంది. ఈ షాపింగ్ మాల్ ను రోజుకు 24,282 మంది సందర్శిస్తుంటారు. ముంబైలోని ఫినిక్స్ మార్కెట్ సిటీ లోని షాపింగ్ మాల్ ను 23,000 మంది సందర్శిస్తుంటారు. ఇది మూడో స్థానంలో కొనసాగుతోంది..