Arvind Kejriwal: రెండు రోజుల్లో రాజీనామా చేస్తా.. నిర్దోషిత్వం నిరూపించుకుంటా.. ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం!

మద్యం కుంభకోణంలో ఐదున్నర నెలలు తిహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెయిల్‌ సందర్భంగా సుప్రీం కోర్టు నిబంధనలు విధించిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : September 15, 2024 3:54 pm

Arvind Kejriwal(1)

Follow us on

దేశంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభ కోసం ఢిల్లీలోని అధికార ఆప్‌ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టింది. రెండేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. పలువురు అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో చాలా మంది అప్రూవర్‌గా మారి బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రం అప్రూవర్‌గా మారలేదు. దీంతో వీరు ఎక్కువకాలం జైల్లో ఉన్నారు. ఇటీవలే వరుసగా ఈ ముగ్గురు కూడా జైలు ఉంచి బయటకు వచ్చారు. సుప్రీం కోర్టు ఈ ముగ్గురికి బెయిల్‌ మంజూరు చేసింది. ఇక అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు సందర్భంగా సుప్రీం కోర్టు.. కీలక నిబంధనలు విధించింది. సీఎంగా కేజ్రీవాల్‌ ఫైళ్లపై సంతకాలు చేయడానికి ముందు.. లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇది కేజ్రీవాల్‌కు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సీఎం పదవికి రాజీనామా..
అరవింద్‌ కేజ్రీవాల్‌కు మొదటి నుంచి పంతం ఎక్కువ. అందుకే ఆయన కేంద్రం ఎన్ని ఒత్తిళ్లు చేసినా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా సుప్రీం కోర్టు నిబంధనల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొత్త సీఎం ఎవరనేది రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తా అని తెలిపారు. కొందరు ఆప్‌ను చీల్చేందుకు కుట్రలు చేశారని, తనను జైలుకు పంపి ఆప్‌ను ఢిల్లీ గద్దె దించాలని భావించారని పేర్కొన్నారు. కానీ వారి కుట్రలు ఫలించలేదని తెలిపారు. తాను సీఎంగా కొనసాగడంపై అభ్యంతరం ఏంటని సుప్రీం కోర్టే ప్రశ్నించిందని గుర్తు చేశారు.

ప్రజాతీర్పు కోరతా…
రాజీనామా తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్తానని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇంటింటికీ వెళ్లి.. ప్రజాతీర్పు కోరతానన్నారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని, వారి తీర్పు మేరు నడుచుకుంటానని వెల్లడించారు. ప్రజలు మళ్లీ గెలిపిస్తే తాను నిర్దోషినే అని తెలిపారు. తాను రాజీనామా చేశాక ఎవరు సీఎం అనేది ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ ఏడాది నవవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్‌ రాజీనామా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఢిల్లీ అసెంబ్లీని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. తాను నిర్దోషి అని నమ్మితేనే తనకు ఓటు వేయాలని కేజ్రీవాల్‌ ప్రజలను కోరుతున్నారు.

కేజ్రీవాల్‌ ప్లాన్‌ ఇదే..
అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా ప్లాన్‌లో రెండు ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. బీజేపీకి తాను తలొగ్గలేదని నిరూపించుకోవడం, కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పినా ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని, ఎదురించి కొట్లాడాలని పరోక్షంగా విపక్షాలకు సందేశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక కేంద్రంతో ఎందాకైనా అన్న ఇండికేషన్‌ కూడా రాజీనామాతో ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక లిక్కర్‌ స్కాం అంతా కేంద్రం తప్పుడు సృష్టి అని బీజేపీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. ప్రజలు మళ్తీ తనకు అవకాశం ఇస్తే.. తాను ఏ తప్పు చేయలేదని నిరూపితం అయినట్లే అని ప్రకటించారు. అంటే కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా కేంద్రాన్ని ఇరుకున పెట్టబోతున్నారు.

సీఎం అయితే నిర్దోషి అయినట్లేనా..
ఇదిలా ఉంటే.. సీఎం అయితే నిర్దోషి అయినట్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్, చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. వారు కేసుల విచారణకు హాజరవుతూనే సీఎంలుగా ఎన్నికయ్యారు. అంటే వాళ్లు నిర్దోషులా, గతంలో జయలలిత కూడా సీఎం అయ్యారు. జైలు శిక్ష పడ్డాక రాజీనామా చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ మళ్లీ సీఎం అయితే నిర్దోషినే అని ప్రకటించడం ద్వారా తనకు తానే తీర్పు చెప్పుకున్నారు. గెలిస్తే సరి.. ఓడితే దోషి అయినట్లేనా మరి అన్న చర్చ జరుగుతోంది.