Nitin Gadkari: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి.. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాకుంటే.. ప్రధాని పదవికి నితిన్ గడ్కరీ పేరు ప్రతిపాదిస్తారని ఎన్నికలకు ముందు ప్రచారం జరిగింది. దీంతో నితిన్ గడ్కరీకి ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు కూడా మద్దతు ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆయన ప్రధాని పదవిపై సంచల వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, కానీ తాను ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కరీ 2014లో ప్రధాని అభ్యర్థి అవుతారని అంతా భావించారు. కానీ, మోదీ తెరపైకి వచ్చారు. దీంతో గడ్కరీ మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. వరుసగా మూడు పర్యాయాలు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మధ్యలో 2019, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో నితిన్‌గడ్కరీ ప్రధాని అన్న పేరు వినిపించింది. కానీ, మోదీకే మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే.. గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమయ్యాయి.
ఆఫర్ ఇచ్చింది ఎవరంటే..
ఇదిలా ఉంటే.. నితిన్ గడ్కరీకి ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చింది ఎవరనేది వెల్లడించలేదు. కాకపోతే.. తన పేరు ప్రతిపాదిస్తే.. విపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానన్నారు. నాగపూర్‌లో శనివారం నిర్వహించిన జర్నలిస్టుల అవార్డు ప్రధానోత్సవంలో మాట్లాడారు. ఒకసారి ఒక నాయకుడు తన వద్దకు వచ్చి.. మీరు ప్రధాని పదవి రేసులో నిలబడితే తాము మద్దతిస్తామని చెప్పారన్నారు. కానీ, ప్రధాని కావడం తన లక్ష్యం కాదని, అందుకే ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు. అయితే తనను కలిసిన ఆ నేత ఎవరు.. ఆఫర్ ఎందుకు ఇచ్చారు అనే వివరాలు వెల్లడించలేదు. ఆఫర్ ఇచ్చిన నేత పేరు చెప్పనని తెలిపారు. ‘నాకు ఎందుకు మద్దతు ఇస్తారు.. మీ మద్దతు నేనెందుకు అంగీకరించాలి’ అని ప్రశ్నించానని చెప్పారు. తాను విలువలకు, తన పార్టీకి కట్టుబడి ఉంటానని తెలిపానని వెల్లడించారు.
ప్రధాని రేసులో..
ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు.. ఫిబ్రవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాని పదవి రేసులో తొలి రెండు స్థానాల్లో మోదీ, అమిత్‌షా ఉండగా, మూడో స్థానంలో నితిన్‌గడ్కరీ నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో గడ్కరీ ప్రధాని అవుతారని భావించారు. కానీ గడ్కరీ.. స్వయంగా మోదీని ప్రతిపాదించారు. తాము మోదీ వెంట ఉంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే గడ్కరీ 2014 నుంచి వరుసగా రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009 నుంచి 2013 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.