MLA Lasya Nanditha: హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు పై దారుణం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే లాస్య నందిత(33) కన్నుమూశారు. ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె కారులో ప్రయాణిస్తుండగా.. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అధికం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును తోలుతున్న డ్రైవర్, పీఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు.
లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు బోల్తాపడటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని బోల్తా పడిన కారు నుంచి డ్రైవర్ ను బయటకు తీశారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సాయన్న కుమార్తె లాస్య నందితకు కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించారు.
అంతకుముందు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్లగొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్ పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీ కొట్టింది. అప్పట్లోనే ఆమె గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఈ క్రమంలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదం. గత సంవత్సరం ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చనిపోయిన ఏడాది పూర్తయిన నాలుగు రోజులకే మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.