ACB Raids: లంచం తీసుకోవడం నేరం.. ఇవ్వడం కూడా నేరమే. సరిగ్గా ఇదే ప్రాతిపదికన 2025లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పని చేసింది. విస్తృతంగా దాడులు చేసి అవినీతికి పాల్పడుతున్న అధికారులకు చుక్కలు చూపించింది. వారు వసూళ్లకు పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రెవెన్యూ నుంచి మొదలు పెడితే నీటిపారుదల వరకు ఏ శాఖ ను కూడా ఏసీబీ వదిలిపెట్టలేదు.
2025 సంవత్సరంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మొత్తం 199 కేసులు నమోదు చేశారు. ఈ ప్రకారం ప్రతి రెండు రోజులకు దాదాపు ఒక కేసు నమోదు అయినట్టు. ఈ కేసుల్లో మొత్తం 273 మంది అధికారులను అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా ట్రాప్ ఆపరేషన్ల ద్వారా జరిగింది. ట్రాప్ ఆపరేషన్ల ప్రకారం లంచం తీసుకుంటున్న అధికారులను ఎసిబి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. ఇలా 157 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. వీటి ఫలితంగా 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 224 మంది అరెస్టు అయ్యారు. ఏసీబీ అధికారులు దాదాపు 57 లక్షల పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమాస్తుల కేసులలో ఏసీబీ దాదాపు 96.13 కోట్ల ఆస్తులను వెలికి తీసింది. 15 కేసులలో ఏసీబీ అత్యంత లోతుగా దర్యాప్తు నిర్వహించింది. మరో 26 కేసులలో అవినీతి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించిన కారణంగా ఏసీబీ తీవ్రమైన కేసులు నమోదు చేసింది. ఇందులో 34 మంది అధికారులు అరెస్టు అయ్యారు. అవినీతిని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, ఆర్టిఏ తనిఖీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలలో ఏసీబీ ఆకస్మికతనిఖీలు నిర్వహించింది. ఇందులో 115 కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారులకు దొరికిపోయిన వారిని విచారించడానికి కోర్టు అనుమతి ద్వారా ప్రాసెక్యూట్ చేసింది. విచారణ అనంతరం సేకరించిన వివరాల కు అనుగుణంగా చార్జ్ షీట్లు దాఖలు చేసింది.
అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారం అందించడానికి గత ఏడాది డిసెంబర్ 3 నుంచి 9 మధ్య జరిగిన అవినీతి నిరోధక వారం సందర్భంగా ఏసీబీ ఒక సాధారణ క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించింది. ఎవరైనా సరే ఆ కోడ్ స్కాన్ చేసి.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు అనేక జిల్లాలలో వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసింది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ర్యాలీలు జరిపింది. విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపించింది. అవినీతికి పాల్పడే అధికారులకు సంబంధించిన సమాచారాన్ని 1064 కు కాల్ చేసి చెప్పాలని.. వాట్సాప్ లో మెసేజ్ కూడా పంపించండి సూచించింది. ఏసిబికి డైరెక్టర్ జనరల్ గా చారు సిన్హా వ్యవహరిస్తున్నారు. ఈమె ఆధ్వర్యంలో అధికారుల బృందాలు విస్తృతంగా తనిఖీలు చేసి.. అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి.