ABN Radha Krishna: బిజెపిలో కత్తుల యుద్ధం సాగుతోంది.. వైసిపి, టిడిపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.. రేవంత్, కేటీఆర్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.. ప్రధానిగా నరేంద్ర మోడీని మార్చాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటున్నది. రాబర్ట్ వాద్రా పై ఈడీ నజర్ పెట్టింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఏకంగా వైసిపి పార్లమెంట్ సభ్యుడిని ప్రత్యేక విచారణ బృందం అరెస్ట్ చేసింది.. ఇంతటి పరిణామాలు జరుగుతుంటే.. ఈ స్థాయిలో అల్లకల్లోలం చోటు చేసుకుంటుంటే ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానల్ యజమాని వేమూరి రాధాకృష్ణ సైలెంట్ గా ఉండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సైలెంట్ గా ఉండిపోయాడు అంటే తన పత్రికలో ఈ వార్తలు రాయలేదని కాదు. తన ఏబీఎన్ లో ప్రసారం చేయలేదని కాదు. అన్ని మీడియా సంస్థల లాగానే.. ఆయన సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. కానీ వీటిపై వేమూరి రాధాకృష్ణ తన అంతరంగాన్ని ఆవిష్కరించలేదు. తనకున్న సమాచారాన్ని పాఠకులతో పంచుకోలేదు. ఎందుకంటే ప్రతి ఆదివారం ఆయన కొత్త పలుకు శీర్షికన సంపాదకీయం రాస్తుంటారు. వర్తమాన రాజకీయాల పై తనదైన విశ్లేషణ చేస్తుంటారు.. అందుకే ఆయన రాసిన కొత్త పలుకు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది.. నచ్చినవాళ్లు పొగుడుతుంటారు. నచ్చని వాళ్ళు తిడుతుంటారు. సరిగ్గా రెండు వారాల క్రితం ఆయన తెలంగాణ బీఆర్ ఎస్ జాగీరా అనే శీర్షికన రాసిన సంపాదకీయం చర్చకు దారి తీసింది. దీని ఆధారంగా గులాబీ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వేమూరి రాధాకృష్ణ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సంపాదకీయం తర్వాత దాడులు చేస్తారేమోననే సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆంధ్ర జ్యోతి కార్యాలయాల ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలకు గులాబీ పార్టీ నాయకులు తమదైన వ్యక్తీకరణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ తదుపరి వారంలో వేమూరి రాధాకృష్ణ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. మళ్లీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అయితే ఈసారి కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు తనకు సలహా ఇచ్చారని.. కొంతమంది వ్యక్తులను ప్రస్తావించకపోవడమే మంచిదని వారు సూచించారని రాధాకృష్ణ ఆ సంపాదకీయంలో పేర్కొనడం విశేషం. మొత్తంగా చూస్తే వివాదాలు ఎందుకు అనే కోణంలోనే రాధాకృష్ణ మారిపోయాడా? అనే చర్చలు కూడా జరిగాయి.. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం దమ్ బిర్యాని మాదిరిగా వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు ఉంటుందని అందరూ అనుకున్నారు. వారందరి అంచనాలను రాధాకృష్ణ తలకిందులు చేశాడు. దమ్ బిర్యాని కాదు కదా కనీసం వెజ్ బిర్యానీ కూడా పెట్టలేదు. తన పత్రికలో ఈ ఆదివారం కొత్త పలుకు సంపాదకీయం రాయలేదు. నిజంగా రాధాకృష్ణ వివాదాస్పద అంశాల జోలికి పోదల్చుకోలేదా? అందుకే కొత్త పలుకు రాయలేదా? అనే చర్చలు సాగుతున్నాయి. ఆయన అభిమానులు మాత్రం.. మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంత బ్రేక్ తీసుకున్నాడని.. మళ్లీ వచ్చేవారం ఫినిక్స్ పక్షి లాగా తన స్టామినా చూపిస్తాడని అంటున్నారు. చూడాలి మరి వచ్చే ఆదివారం వేమూరి రాధాకృష్ణ ఎలాంటి స్టఫ్ తో వస్తాడో?!