Karimnagar
Karimnagar: కరీనంగర్ ఉద్యమాల గడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటి చేసి గెలవడం, ఆమరణ దీక్ష ఇక్కడి నుంచే మొదలు పెట్టడంతో కరీంనగర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన దాడిలో గాయపడింది కూడా అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్న ప్రభాకర్. ఇలా కరీంనగర్‌కు పోరాటాల గడ్డగా గుర్తింపు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలోనూ కరీంనగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2014లో ఇక్కడి నుంచి ఎంపీగా బోయినపల్లి వినోద్‌కుమార్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ ఖాతాలోపడింది. బండి సంజయ్ ఘన విజయం సాధించారు. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి గెలుపు ఎవరిదో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
అభ్యర్థుల ప్రకటన..
కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ముందు ఉంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోమారు బరిలో దిగనున్నారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఆ పార్టీ అధిష్టాన ఖరారు చేసింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎను ఓడించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. కానీ కరీంనగర్‌లో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు.
ప్రవీణ్‌రెడ్డికి ఛాన్స్..
కరీంనగర్ ఎంపీగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్‌రావు పోటీ పడుతున్నారు. కానీ, అధిష్టానం ప్రవీణ్‌రెడ్డివైపే మొగ్గు చూపుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ప్రవీణ్‌రెడ్డికి కాకుండా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. దీంతో ఎంపీ బరిలో దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.
ముగ్గురూ ముగ్గురే..
ఇక కరీంనగర్ బరిలో దిగనున్న బండి సంజయ్, వినోద్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి ముగ్గురూ రాజకీయాల్లో సీనియర్ నాయకులే. వైఎస్సార్ హయాంలో ప్రవీణ్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక వినోద్‌కుమార్ 2014లో ఎంపీగా పనిచేయగా, బండి సంజయ్ కూడా 2019లో గెలిచి ఎంపీగా ఉన్నారు. సంజయ్, వినోద్‌కు కరీనంగర్ జిల్లాపై మంచి పట్టు ఉంది. ప్రవీణ్‌రెడ్డికి మాత్రం హుజూరాబాద్, హుస్నాబాద్‌లో బలం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి ప్లస్ పాయింట్. ఇక బీఆర్‌ఎస్‌కే కాస్త కష్టంగా ఉంది. అయినా గతంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A three way contest in karimnagar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com