Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీలో అతర్గత కలహాలు, అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే, పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశమే. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత వారిద్దరూ పార్టీని వీడి వెళ్ళిపోతారా? అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో రోజుకో కొత్త ప్రచారం ఆయనపై జరుగుతుంది. ఈటల రాజేందర్ కు బండి సంజయ్‌తో పడడం లేదని, ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఈటల వర్గీయులు డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ సాగుతుంది. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యత అప్పగిస్తారని భావించినా అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఈటల రాజేందర్ ఉన్నారని సమాచారం. ఇక తాజా పరిణామాలు ఈటల రాజేందర్‌కు పొమ్మనకుండానే పొగ పెట్టినట్టుగా మారాయని ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు లేకపోలేదని చర్చ జరుగుతుంది.
పార్టీ మారేది లేదంటూనే..
అయితే చర్చ ఎలా ఉన్నా.. తాను మాత్రం పార్టీ మారేది లేదని పదేపదే చెప్తున్నారు ఈటల. పార్టీ చేరికలు కమిటీకి చైర్మన్‌గా అవకాశం ఇస్తే ఆ బాధ్యతను నిర్వహించలేక చేతులెత్తేశారు. ఈటల రాజేందర్ హయాంలో బీజేపీలో చేరిన ముఖ్యనాయకులు లేరు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలోకి తీసుకురావడంతో ఈటల విఫలమయ్యారు. దీంతో ఒక ఫెయిల్యూర్ లీడర్ గా ఈటల రాజేందర్‌ను చూస్తున్న పరిస్థితి బీజేపీలో ఉంది.
కీలక బాధ్యతలు లేకనే..
బీజేపీలో ఈటల మరింత కీలక బాధ్యతలు ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో అధిష్టానం ఈటలను పిలిచి మాట్లాడినా స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వడ లేదని సమాచారం. ఈ పరిణామాలతో ఈటల తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. జాతీయ అధ్యక్షుడు నాగర్‌కర్నూల్ వచ్చినా ఈటల సభకు రాలేదు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ పార్టీ వీడి వెళ్లడం ఖాయమని రోజుకో రకమైన ప్రచారం జరుగుతుంది.
సోషల్ మీడియాకు దూరం..
ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ తన ట్విట్టర్, ఫేస్ బుక్ బయో నుంచి బీజేపీని తొలగించారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అలాంటిదేమీ లేదని ఈటల రాజేందర్ అనుచరులు ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను వాట్సాప్ గ్రూపులలో పెట్టి కావాలనే ఈటల రాజేందర్‌పై దుష్ప్రచారం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఎందుకు ఈటల రాజేందర్ పై ఈ విధమైన ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచార పర్యవసానం ఏమవుతుంది అన్నది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.