https://oktelugu.com/

KTR and Harish: పాత సీసాలో కొత్త సారా.. వర్కవుట్ అవుతుందా కేటీఆర్, హరీషూ!

ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం ఒక ట్రెండ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర రికార్డు సృష్టించింది. దాంతో ఆయన ఆ వెంటనే అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్ర చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆ తరువాత ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది పాదయాత్రలు చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2024 3:11 pm
    KTR-Harish-rao

    KTR-Harish-rao

    Follow us on

    KTR and Harish: ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం ఒక ట్రెండ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర రికార్డు సృష్టించింది. దాంతో ఆయన ఆ వెంటనే అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్ర చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆ తరువాత ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది పాదయాత్రలు చేశారు. కొందరికి చేదు ఫలితాలు వస్తే.. మరికొందరికి అనుకూల ఫలితాలు వచ్చాయి. అందులోనూ ఏపీలో వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర కూడా ఆయనకు కలిసివచ్చిందని చెప్పాలి. ఇక.. ఆ తరువాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. ఇక.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పార్టీని స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. కానీ.. ఆమె పాదయాత్రను తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించలేదు. దాంతో తెలంగాణలో ఆమె పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

    అయితే.. పాత సీసాలో కొత్త సారా లెక్క.. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పాత ట్రెండును ఫాలో అయ్యేందుకు రెడీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగింది. పది నెలల తరువాత రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. దీంతో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు నానా యాతన పడుతున్నారు. పార్టీ ఓడిపోయి.. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఇంతవరకు ప్రజల్లోకి వచ్చింది లేదు. గత పది నెలలుగా ఆయన ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. అక్కడి నుంచే నేతలకు డైరెక్షన్లు ఇస్తున్నారని ప్రచారం ఉంది. అయితే.. కేసీఆర్ బయటకు రాకపోవడానికి అనారోగ్య కారణాలు ఉన్నాయని ఇటీవల కేటీఆర్ చెప్పుకొచ్చారు. సరే ఏది ఏమైనప్పటికీ పది నెలలుగా ఆయన మాత్రం ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు.. ఒక ప్రకటన సైతం ఇచ్చింది లేదు.

    ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పెద్ద సంఖ్యలో క్యాడర్‌ను కోల్పోయింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంత మంది వెళ్లిపోయేందుకు రెడీ అయిపోయారు. ఇలా పార్టీ పరిస్థితి రోజురోజుకూ దివాలా తీస్తోంది. ఈ క్రమంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి సీనియర్ నేతలు, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావులే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై కొట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. నిరసనల్లోనూ పాల్గొంటున్నారు. అటు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

    ఇప్పుడు.. తాజాగా బీఆర్ఎస్ తీసుకున్న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి..? పార్టీ ఏం చేయబోతోంది అంటే.. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించబోతున్నారు. అది కూడా.. ఉత్తర తెలంగాణలో కేటీఆర్, దక్షిత తెలంగాణ మొత్తంగా హరీశ్ పాదయాత్ర చేయనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ డైరెక్షన్‌లోనే వీరు పాదయాత్రకు సిద్ధమవుతున్నారట. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎవరు ఎక్కడి నుంచి ప్రారంభించాలి..? ఎక్కడ ముగించాలి..? అనే అంశంపై కేసీఆర్ ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి రూట్ మ్యాప్ రెడీ చేసినట్లుగా పార్టీలో ప్రచారం నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే మరో నాలుగేళ్లు ఆగాల్సిందే. మరి ఈ క్రమంలో ఇప్పుడే ఈ ఇద్దరు నేతలు పాదయాత్రలు చేపడితే పార్టీకి మైలేజీ వస్తుందా..? అధినేత అనుకున్న లక్ష్యం సాధ్యపడుతుందా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పాదయాత్ర మైలేజీ ఉంటుందా అనేది అర్థం కాని పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ కూడా పాత పంథానే ఎంచుకోవడంపై పలువురు పార్టీ నేతలు కూడా పెదవి విరుస్తున్నారట.