Dasara Lottery: శీర్షిక చదివి ఎగిరి గంతేశారు కదా.. ఇది కదా అసలైన దసరా ఆఫర్ అనుకున్నారు కదా.. అడ్రస్ చెప్పండి.. వెంటనే వంద రూపాయలు ఇచ్చి ఇవన్నీ తీసుకుంటాం.. దసరా పండుగ గొప్పగా చేసుకుంటాం అనుకుంటున్నారు కదా. మీరే కాదు మీ స్థానంలో ఉన్న ఎవరైనా సరే ఇలానే అనుకుంటారు. కానీ శీర్షిక చదివి ఉత్సాహపడకండి. ఉద్వేగానికి గురికాకండి. ఎందుకంటే వంద రూపాయలకు అవన్నీ రావు. స్థూలంగా చెప్పాలంటే షరతులు వర్తిస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో దసరా అనేది అతిపెద్ద పండుగ. నవరాత్రులు, ఆ తర్వాత వచ్చే దసరా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇక దసరా నాడు చుక్క, ముక్క సరే సరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇద్దరు యువకులకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే కాదు దానిని ఆచరణలో కూడా పెట్టారు. చివరికి విస్తృతమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంతేకాదు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాను వాడుకోవడం ప్రారంభించారు. దీంతో అందరూ వారి గురించే మాట్లాడుకోవడం మొదలైంది.
తెలంగాణ రాష్ట్రంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో ఇద్దరు యువకులు దసరా బంపర్ ఆఫర్ పేరుతో ఒక లాటరీ మొదలు పెట్టారు. దీని ప్రకారం వంద రూపాయలు చెల్లించాలి. లక్కీ డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా 12 కిలోల మేకపోతును అందిస్తారు. రెండవ బహుమతిగా 2 బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్స్ ఇస్తారు. మూడో బహుమతిగా కాటన్ బీర్లు ఇస్తారు. నాలుగో బహుమతిగా రెండు పట్టు చీరలు ఇస్తారు. ఐదవ బహుమతిగా రెండు నాటు కోళ్లు ఇస్తారు. అక్టోబర్ 1న అన్నారంలో పెద్దల సమక్షంలో డ్రా తీస్తారు. వంద రూపాయలు మాత్రమే కావడంతో చాలామంది లక్కీ డ్రా కడుతున్నారు. లక్కీ డ్రాలో ₹100 చెల్లించిన వారి పేరు నిర్వాహకులు నమోదు చేస్తున్నారు.. గతంలో కూడా ఇదే తరహాలో ఈ ప్రాంతంలో లక్కీ డ్రా నిర్వహించారు. కేవలం 100 రూపాయలు మాత్రమే కావడంతో చాలామంది డ్రా చెల్లించారు. చివరికి అన్ని ఖర్చులు పోను నిర్వాహకులకు లక్ష వరకు మిగిలాయని తెలుస్తోంది.