HomeతెలంగాణCash For Vote Case: ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం

Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం

Cash For Vote Case: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

బీఆర్‌ఎస్‌ నేతల పిటిషన్‌
ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కోర్టుకు మార్చాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహమూద్‌ అలీలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌.గవాయ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం శుక్రవారం(ఫిబ్రవరి 9న) విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసలు పంపింది. ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరగదని పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేశారు. ట్రయల్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈమేరకు జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది మోహిత్‌రావు కోర్టుకు విన్నవించారు. ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉంటే తాము చూస్తూ ఊరుకోమని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్‌రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. దీంతో న్యాయస్థానం నోటీసులు జారీ చేసి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. మరి నోటీసులకు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular