Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam) నుంచి భట్టి విక్రమార్క(Bhatti vikramarka), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మంత్రులుగా ఉన్నారు. వీరిలో భట్టి విక్రమార్క సొంత మండలం అయిన వైరాలో 99 రిజిస్ట్రేషన్లు ఒక్కరోజు రాత్రి పూర్తి కావడం అనుమానాలకు తావిస్తోంది.. వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయం వేదికగా రాత్రి సమయంలో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్లు స్టాంపులు శాఖలో కలకలం రేపుతోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) లో ఆమోదం పొందని స్థిరాస్తి ప్లాట్లకు 99 రిజిస్ట్రేషన్లు చేయడం విశేషం. వైరా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఇది ఖమ్మం నగరపాలక సంస్థకు దగ్గర్లోనే ఉంటుంది. వైరా పురపాలక సంఘంగా ఏర్పడింది. వైరా నియోజకవర్గ పరిధిలో కొనిజర్ల మండలం ఉంటుంది. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఈ మండలంలో భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఈ మండలంలో అనేకంగా స్థిరాస్తి వెంచర్లు ఉన్నాయి. కొన్ని వెంచర్ల నిర్వాహకులు ఎల్ ఆర్ ఎస్ పథకానికి దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇంకా రాలేదు. అయితే క్రమబద్ధీకరణకు అనుమతులు లభించని ప్లాట్లకు వైరా సబ్ రిజిస్ట్రార్ ఏకంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం సంచలనం కలిగిస్తోంది. కొణిజర్ల మండలంలో తనికెళ్ళ, అమ్మపాలెం గ్రామాల్లో విస్తారంగా వెంచర్లు ఉన్నాయి. ఇక్కడ భూమికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఏర్పాటుచేసిన వెంచర్లలో సరైన నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి.. గత ప్రభుత్వం అనుమతి పొందని లేఅవుట్లలో స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయకుండా నిబంధనలు విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగిస్తోంది..
25 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో..
లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు 4.50 లక్షల దరఖాస్తులను పూర్తి చేసామని అధికారులు చెబుతున్నారు.. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిటిసిపి, రెరా అనుమతులు పొందిన వెంచర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది..ఎల్ ఆర్ ఎస్ లేకపోయినప్పటికీ గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనక భారీగానే నగదు చేతులు మారిందని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు.. రిజిస్ట్రేషన్ లపై ఆరా తీశారు . ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిఐజికి ఆదేశాలు జారీ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టారు.. దాదాపు అందరి అధికారులను బదిలీ చేశారు. చాలాకాలం ఒకే చోట పని చేసిన అధికారులను మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. రెవెన్యూ విభాగంలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేశారు. ఇంత చేస్తున్నప్పటికీ ఇలా జరగడం రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులకు మింగుడు పడటం లేదు.