GHMC: ఒకప్పుడు హైదరాబాద్ ఒక స్థాయి వరకు ఉండేది. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్డు అనేది అందుబాటులోకి వచ్చిందో.. అప్పుడే హైదరాబాదు రూపు రేఖలు మారిపోయాయి. కొత్త హైదరాబాద్ పుట్టుకొచ్చింది. శివారు ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెందడంతో హైదరాబాద్ నగరం మహానగరంగా విస్తరించింది. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పలు ప్రాంతాలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మరింతగా విస్తరించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న పురపాలకాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో కలిపేసింది.. ప్రభుత్వ నిర్ణయంతో ఇన్ని రోజులపాటు పురపాలకాల పరిధిలో ఉన్న ప్రజలలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. వారికి లభించే ప్రయోజనాలు, ఎదురయ్యే నష్టాల గురించి చర్చించుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పురపాలకాలను విలీనం చేసిన క్రమంలో ఆస్తి పన్ను పెరుగుతుందా? చెల్లించే పనులు ఇతర ప్రాంతాలలో ఖర్చు చేస్తారా? అభివృద్ధి అనేది స్థిరంగా సాగుతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మణికొండ, నార్సింగి నగరపాలక సంస్థలకు ఆస్తి పన్ను విపరీతంగా వస్తుంది. తుక్కుగూడ, జల్ పల్లి, జవహర్ నగర్ ప్రాంతాలు సరైన ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. వీటన్నిటిని హైదరాబాదులో కలిపితే నిధులు ఎలా ఖర్చు చేస్తారు? అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతుంది.
హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న గ్రామాలు ఇకపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అవుతాయి.. వాటిని నగర అభివృద్ధిలో భాగస్వామ్యం ఎలా చేస్తారు? ఒకవేళ చేస్తే ఏం పద్ధతి పాటిస్తారు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గ్రామీణ వాతావరణం పట్టణ వాతావరణంతో పోల్చి చూస్తే భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు విలీన గ్రామాలలో అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి.
హైదరాబాద్ నగరం అతి పెద్దది అయినప్పటికీ.. ప్రాంతాల ఆధారంగా జనసాంద్రత ఉంటుంది. ఉదాహరణకు పెద్ద అంబర్పేట్, తుక్కుగూడ, ఘట్కేసర్ ప్రాంతంలో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. నార్సింగి, మణికొండ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అప్పుడు ఈ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు అధికారులు జనాభాను, ఇతర విషయాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
డివిజన్ల పునర్విభజన గతంలోనే అనేక అలజడులను సృష్టించింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కచ్చితంగా డివిజన్ల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అధికారులు ఎలాంటి విధానాన్ని పాటిస్తారు.. వివాదాలు లేకుండా ఎలా పరిష్కరిస్తారు.. అనేక ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచన గొప్పగానే ఉన్నప్పటికీ.. దాని ఆచరణ సాధ్యమైతేనే ఆ నిర్ణయానికి సార్ధకత లభిస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు.