Medaram Reconstruction: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువై ఉంది మేడారం పుణ్యక్షేత్రం. దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. పది రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మహా జాతర జరుగుతుంది. ఈసారి జరిగే జాతర కని విని ఎరుగని స్థాయిలో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో మేడారం చరిత్రలోనే తొలిసారిగా 251 కోట్లతో భారీగా అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గతంలో వేరువేరుగా ఉండే సమ్మక్క, సారక్క, గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలు.. ఇప్పుడు ఒకే వరుసలోకి వచ్చేసాయి. బుధవారం మేడారం పూజారులు పూజలు చేసి, ఈ గద్దెలను ప్రారంభించారు. ఈ గద్దెల ప్రారంభోత్సవంతో మేడారం సరికొత్తగా కనిపిస్తోంది. కేవలం గద్దెల విస్తరణ కోసమే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 101 కోట్లు ఖర్చు చేసింది.
గద్దెల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంది. చారిత్రాత్మకమైన కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలాగా పూర్తిగా రాతితో నిర్మించింది. 46 పిల్లర్లతో, 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారాన్ని నిర్మించింది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలను నిర్మించింది. గద్దెల ప్రాంగణానికి ఎదుట యాభై అడుగుల వెడల్పుతో అతిపెద్ద ప్రధాన స్వాగత తోరణాన్ని నిర్మించింది. భక్తులు మొత్తం ఒకే వరుసలో దేవతలను దర్శించుకోవడానికి గద్దెలను ఏర్పాటు చేశారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ ఎనిమిది స్తంభాలను ఏర్పాటు చేశారు. మధ్యలో వెదురుబొంగులను తీర్చిదిద్దారు. తాళపత్రాలలో కోయ వంశీకుల చరిత్రను తెలిసేలాగా శిలల మీద ఆదివాసీల సంస్కృతిని రూపొందించారు. ఆదివాసులు వాడే పరికరాలు.. ఇతర వస్తువులను వాటిపై ముద్రించారు. సమ్మక్క సారక్క వీరోచితమైన పోరాటం.. జంపన్న చూపించిన తెగువ.. అన్ని కూడా ఈ స్తంభాల మీద చెక్కించారు..
స్తంభాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేకమైన తెలుపు రంగు రాళ్ళను తీసుకొచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వరకు తెల్ల రాళ్లను తరలించి.. అక్కడ శిల్పులతో చెక్కించిన తర్వాత మేడారం తీసుకొచ్చారు. ప్రధానంగా ఏర్పాటు చేసే స్వాగత తోరణం మీద సమ్మక్క వంశానికి సంబంధించిన వ్యక్తుల చరిత్రను నేటి తరానికి తెలియజేసే విధంగా 59 బొమ్మలు చెక్కారు.
సమక్కది రాయి బంధానీ అయిదవ గొట్టు వంశం. ఒక కొమ్ము మాత్రమే ఉండే దుప్పి.. రెండువైపులా అడవి దున్న కొమ్మలు.. నెమలి ఈకలతో గల తోరణం అగ్రభాగంలో చెక్కారు. ఇక మిగతా శిలల మీద 3,4,5,6,7 గట్టుల వంశీయుల చరిత్ర, వారు పూజించిన దేవతలు, జంతువులు ఇతర జీవనశైలిని చెప్పే విధంగా చిత్రాలు చెక్కారు మొత్తంగా ఇందులో 750 మంది కోయవంశీయులకు సంబంధించిన 7వేల బొమ్మలు ఉన్నాయి. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు ఈ స్తంభాల మీద శిల్పాలను చెక్కారు. స్తపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతిలాల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి సంబంధించిన 15 మంది విద్యార్థులు కూడా ఈ చిత్రాల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 15 సంవత్సరాల పాటు శ్రమ పడితే ఈ స్థాయిలో కోయ వంశీయుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తోందని డాక్టర్ మహిపతి అరుణ్ కుమార్ వెల్లడించారు.