CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే వర్తిస్తోంది. దీనిపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఎలాంటి నిబంధన లేకుండా గుర్తింపు కార్డు ఉంటే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు.
త్వరలో మరో రెండు గ్యారంటీల అమలు
త్వరలో మరో రెండు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో ఒకటి రూ.500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు ఉన్నాయి. ఈమేకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈనెలలో బడ్జెట్ ప్రవేశపెట్టి దీనిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో అర్హులను తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రేషన్‌కార్డు ఉంటేనే..
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ త్వరలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. ఈమేరకు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క త్వరలో అనుమతి ఇస్తారని ప్రకటించారు. అయితే, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. గతేడాది వినియోగించిన విద్యుత్‌ను తెక్కించి తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.
కార్డు లేనివారిలో ఆందోళన..
తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఉచిత విద్యుత్ అని ప్రకటించడంతో అర్హత ఉండి కార్డు లేనివారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వారిలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారు మాత్రమే అర్హులు. ఈలెక్కన 20 లక్షల మంది అర్హత కోల్పయే అవకాశం ఉంది. అంటే 70 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.