Iragampally: వైసీపీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. చివరకు చిన్నారుల భోజనం విషయంలో సైతం అమానుషంగా ప్రవర్తించారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశారు. దిక్కున్న చోట ఫిర్యాదు చేసుకోవాలని హెచ్చరించారు. దీంతో విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. శ్రీ సత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తచెరువు మండలం ఇరగంపల్లి పంచాయతీ వంగపల్లి లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. గతంలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉండేవారు. దీంతో ఇరగంపల్లి పాఠశాలలో తయారుచేసిన భోజనాన్ని వంగపల్లి పాఠశాలకు అందించేవారు. అయితే ఇటీవల హెచ్ఎం గోపి బాధ్యతలు స్వీకరించారు. తల్లిదండ్రులకు ఒప్పించడంతో 23 మంది విద్యార్థులు చేరారు. గత నెల 23 నుంచి ఇరగంపల్లి పాఠశాల భోజన ఏజెన్సీ నిర్వాహకులు భోజనం అందించలేదు. దీంతో హెచ్ఎం సర్పంచ్ గంగారత్న దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో వారం రోజులపాటు సత్యసాయి భక్తుల సహకారంతో విద్యార్థులకు భోజనం పెట్టారు. ఇటీవల పేరెంట్స్ కమిటీ తీర్మానం మేరకు వంగపల్లి పాఠశాల ప్రాంగణంలోని భోజనం తయారు చేయాలని నిర్ణయించారు. స్థానికులకు ఆ బాధ్యతలను అప్పగించారు.
దీనిపై ఆగ్రహించిన సర్పంచ్ గంగ రత్నం భర్త శ్రీనివాసులు, రేషన్ డీలర్ రమేష్ శుక్రవారం పాఠశాలకు తాళం వేశారు. ఉదయం 8:45 గంటలకు పాఠశాలకు వచ్చిన హెచ్ఎం గేటుకు తాళం ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న వైసిపి నేతలు మా అనుమతి లేకుండా ఏజెన్సీని ఇతరులకు అప్పగించి పాఠశాలను ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. పిల్లలను బలవంతంగా ఇళ్లకు పంపారు. దీంతో హెచ్ఎం మండల కేంద్రానికి చేరుకొని ఎంఈఓ కు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ విషయం మీడియాలో రావడంతో స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. చివరకు ఎంఈఓ వెళ్లి స్వయంగా తాళాలు తీయించారు. అయితే హెచ్ ఎం ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వైసీపీ కీలక నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే వైసిపి నేతల చర్యలు విమర్శలకు గురవుతున్నాయి. ఎన్నికల ముంగిట ఇటువంటి వాటితో నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.