Renuka Chowdhury: అప్పటి దాకా జింకలను తిన్న పులి వృద్దాప్యం ముంచుకు రాగానే గుహలో సాధు జీవి అవుతుంది. సరిగ్గా ఇలాగే తమ ప్రభ మసక బారుతున్నా కొద్దీ రాజకీయ నాయకులు వైరాగ్యాన్ని ఆశ్రయిస్తారు. విలువల సారాన్ని బోధిస్తారు. కానీ కొందరు వయసు మళ్ళినా ఏదో ఒక రూపంలో తమ వాడిని వేడిని చూపిస్తూనే ఉంటారు. ఆ కోవలోకే వస్తారు రేణుకా చౌదరి. కళ్లకు రేబాన్ గ్లాసులు. తినేందుకు ఎండు ఫలాలు..చదివేందుకు సిడ్నీ శెల్టన్ ఫిక్షన్ నవలలు.. ఫార్చ్యూన్ హై ఎండ్ కారు. దిగగానే గొడుగు పట్టే రవి ( ఇప్పుడు లేడు) రేణుకా చౌదరి తీరు ఇది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆమె శాసించారు. భట్టి లాంటి వాళ్ళను ఆడించారు. మళ్లీ ఇప్పుడు ఓ పోలీస్ అధికారి గల్లా పట్టుకొని వివాదాస్పదమయ్యారు.
అది నుంచి ఆమె తీరు అంతే
రేణుకా చౌదరి మామూలుగానే తనకి “ఎదురు” అనే మాటను అస్సలు తట్టుకోలేరు. సందర్భం ఏదయినా, పరిస్థితి ఎలా ఉన్నా తన మాట నెగ్గాలనే బాపతు. అప్పట్లో ఖమ్మంలో జరిగిన ఓ సభలో సీఎం రాజశేఖర్ రెడ్డిని అందరి ముందు పేరు పెట్టి పిలిచారు. రాజశేఖర్ రెడ్డికి కోపం అనే నరం తెగిపోయింది గనుక ఆమె పై సోనియాకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో రేణుకా ఆమె రెండో కూతురు వల్ల నెక్ట్స్ టు పీఎంవో గా ఉండటం వల్ల పెద్దగా ఏమీ కాలేదు. భుజ కీర్తులను, పాదాక్రాంత సేవలను ఇష్టపడే రేణుక..తల బిరుసుకి ఎప్పుడూ పర్యాయ పదమే. అందువల్లే వీహెచ్ నుంచి భట్టి దాకా అందరితోనూ గ్యాపే.
జేసీతో ఎందుకు గొడవ పడ్డారు?
2012 లోనూ అప్పటి ఖమ్మం ఎంపీగా ఉన్న రేణుకాచౌదరి జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున నాయక్ పై ఇదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో భూమి పహాణీల రికార్డు నమోదు కోసం కొంతమంది రైతులు ఆమెను కలిశారు. ఈ క్రమంలో ఆమె జేసీ ఎం ఎం నాయక్ కు ఫోన్ చేసి తన కార్యాలయం వద్దకు రమ్మని ఆదేశించారు. దీనికి స్పందించిన నాయక్ నేను రాలేను అని, ఊపిరి సలపనంత పని ఉంది అని చెప్పేశారు. దీంతో ఆగ్రహం చెందిన రేణుకాచౌదరి వెంటనే నాయక్ ఆఫీస్‌కి వెళ్లారు. నేను పిలిస్తే నువ్వు రావా అంటూ నాయక్ ను ఏకవాక్య సంబోధన చేశారు. దీనికి నాయక్ కూడా అంతకంటే ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకానొక దశలో నేను ఐఏఎస్‌ను దేశంలో ఎక్కడైనా పని చేయగలను. నా సర్వీస్ కేవలం ఐదు ఏళ్ళు మాత్రమే కాదు అని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామంతో రేణుకా చౌదరికి ఈగో హర్ట్ అయి అక్కడినుంచి వెళ్లిపోయారు. తర్వాత ఎంఎం నాయక్ కూడా బదిలీపై గుంటూరు జేసీగా వెళ్లారు. ఇదొక్కటే కాదు రేణుకా చౌదరి ఫోన్ లో ప్రభుత్వ అధికారులను బెదిరించి భయబ్రాంతులకు గురి చేసిన ఘటనలు ఉన్నాయని ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు చర్చించుకుంటారు.
రాంజీ ఎందుకు చనిపోయాడంటే
ఇల్లందులో డాక్టర్ రాంజీ కి పేరొందిన వైద్యుడనే పేరు ఉంది. వైద్యుల కంటే ప్రజానాయకుడిగా ఉండాలనేది ఆయన కోరిక. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకురాలు మంజుల ద్వారా రేణుకాచౌదరి కలిశారు. రేణుక కూడా రాంజీ నాయక్ ఉబలాటాన్ని క్యాష్ చేసుకున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని ఐదు కోట్ల దాకా తీసుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఇల్లందు టిక్కెట్ హరిప్రియ నాయక్ ఇప్పించడం చకచక జరిగిపోయాయి. దీంతో రేణుకాచౌదరి మాట చెల్లుబాటు కాకపోవడంతో రాంజీ నాయక్ డబ్బుల కోసం నిలదీశాడు. మంజు లను వెంటబెట్టుకొని పలుమార్లు రేణుకాచౌదరిని కలిశాడు. అయినప్పటికీ ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రాంజీ భార్య దిక్కు లేనిది అయింది. పైసల కోసం పలు మార్లు రేణుకా చౌదరిని కలిసినా ప్రయోజనం లేకపోయింది. చివరి అస్త్రంగా పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు ఆ కేసు కోర్టులో నడుస్తోంది.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడితో వివాదం
అసలు పువ్వాడ అజయ్ కుమార్ కి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేను చేసింది రేణుకాచౌదరి. కానీ ఆ పువ్వాడ అజయ్ వినయ విధేయతలు పక్కన బెట్టి టీఆర్ఎస్లో చేరారు. తర్వాత సీన్ కట్ చేస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రేణుకా చౌదరి పోటీ చేశారు. అప్పట్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మమత హాస్పిటల్ పరిధిలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసి రేణుకా చౌదరి అక్కడికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడు టీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్నారు. అతన్ని చూసి రేణుకాచౌదరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు. నేను ఓటర్ల జాబితా పరిశీలించాలి అని ఎన్నికల అధికారులను అడిగితే దీనికి పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడు అభ్యంతరం చెప్పారు. తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకానొక దశలో పువ్వాడ కుమారుడి మీదకి రేణుకా చౌదరి చేయి లేపారు. ఆ సమయంలో అధికారులు వారించారు.
సాయి గణేష్ ఆత్మ హత్య విషయంలోనూ…
అధికార పార్టీ నాయకులు పెడుతున్న ఇబ్బందులు, పోలీసులు పెడుతున్న కేసులను తాళలేక సాయి గణేష్ అనే బీజేపీ కార్యకర్త మొన్నామధ్య ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం పువ్వాడ అజయ్ కుమార్ అని మరణ వాంగ్మూలం ఇచ్చి మరి చనిపోయాడు. కానీ ఇంతవరకు దీనిపైన పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. సాయి గణేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో రేణుకాచౌదరి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ పై “నియంత, పనికి మాలిన వాడు” అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పువ్వాడ అజయ్ కుమార్ దూకుడుగా వెళ్తున్నారు. రేణుకా చౌదరి కి అండగా ఉంటున్న కమ్మ సామాజిక వర్గం లో చీలిక తెచ్చారు. తన అడుగులకు మడుగులొత్తే విధంగా మరో కమ్మ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పువ్వాడ అజయ్ కుమార్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి పై చేసేందుకు హైకమాండ్ నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్నట్లు ఖమ్మం పొలిటికల్ సర్కిల్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Also Read:Agneepath Scheme Protest: ‘అగ్నిపథ్’తో రాజుకున్న ఉత్తరాది.. అసలేంటి కారణం?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana congress leader renuka chaudhary is always in controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com