
తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రైతులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.125కోట్లు విడుదల చేసినా ఆ నిధులు ఎక్కడికెళ్లాయో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెరాస నేతలు కృత్రిమ ఉద్యమం చేశారని ఆయన ఆరోపించారు. బంద్‌లో రైతులు ఎక్కడా పాల్గొనలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా సీఎం కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని సంజయ్ విమర్శించారు.