
ఎల్ఆర్ఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన విషయం విదితమే. ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని సర్కార్ ఆదేశించింది. కొత్తగా వేసిన లేఅవుట్ల ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడంతో రేపు అనగా బుధవారం నాడు జగ్గారెడ్డి చేపట్టనున్న దీక్షను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కరోనాతో తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వ్యాఖ్యానించారు.