
రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని.. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో మెరుగుపర్చాల్సిన అంశాలు, సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు పలువురు మంత్రులు, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమీక్షలో పాల్గొన్నారు. అన్నదాతల సమస్యలు తొలగించేందుకే ధరణి పోర్టల్ తీసుకొచ్చామని.. అందుకు అనుగుణంగా పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2 నెలల వ్యవధిలోనే 1.6 లక్షల స్లాట్‌లు బుక్ చేసుకున్నారని.. వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాలలోపు వారే ఉన్నారని కేసీఆర్ తెలిపారు.