Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలు; ప్రభుత్వ పెద్దలూ.. మీరు పరిమితుల్లో ఉండాలి

1991 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే కోడ్‌ను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తారు.

Written By: NARESH, Updated On : October 10, 2023 10:02 pm
Follow us on

Telangana Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లేనని ప్రకటించింది. ఈ నెల 9 నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా అంటే… ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబరు 3 వరకు ఎన్నిక ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉండనుంది. కోడ్‌ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు, నేతలు, అభ్యర్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఉల్లంఘిస్తే కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించే అవకాశాలుంటాయి. ఒక్కోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. సమగ్రంగా క్రోడీకరించిన ఈ కొత్త నియమావళి… 1991 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే కోడ్‌ను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తారు.

పార్టీలు పాటించాల్సిన నియమావళి

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి అన్ని పార్టీలు, వాటి నేతలు, అభ్యర్థులు తప్పకుండా ఎంసీసీ పాటించాలి.
షెడ్యూలు వచ్చినప్పటి నుంచే పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం కిందకి వస్తుంది.
కులం, మతం పేరిట ఓట్లు అడగకూడదు. ఆలయాలు, మసీదులు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు.
ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం, ఇతరత్రా బెదిరించడం వంటివి చేయకూడదు.
సభలు, సమావేశాలు, ఊరేగింపుల విషయంలో ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి.
సెక్యూరిటీ వాహనాలు మూడు కంటే ఎక్కువ వాడితే… వాటి ఖర్చును ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.
పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.

అధికార పార్టీకి వర్తించే నిబంధనలు…

కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు.
ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఇంటి నుంచి కార్యాలయానికి, తిరిగి వెళ్లడానికి తప్ప ఇతర పనులకు ఉపయోగించకూడదు.
పత్రిక, టీవీ ప్రకటనల కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించడానికి వీల్లేదు.
మంత్రులు అధికారిక పర్యటనలు చేపట్టకూడదు. ప్రచారానికి యంత్రాంగాన్ని వినియోగించకూడదు.
సభలు, సమావేశాల కోసం వినియోగించుకునే మైదానాలు, హెలిప్యాడ్‌లపై గుత్తాధిపత్యం చెలాయించకూడదు. ఇతర పార్టీలు వినియోగించుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి.
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎలాంటి గ్రాంట్లు విడుదల చేయరాదు.
రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు చేయరాదు.
ప్రభుత్వంలోగాని, ప్రభుత్వ రంగ సంస్థల్లోగాని ఎలాంటి తాత్కాలిక నియామకాలు చేపట్టరాదు.