Visakhapatnam Google AI Data Center: ఆంధ్ర ప్రదేశ్ లో( Andhra Pradesh) ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మకమైన గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈనెల 28న ఈ భారీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయల అసాధారణ పెట్టుబడితో.. గూగుల్ తన అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ ద్వారా ఈ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీ మరో మైలురాయి దాటినట్టే. విశాఖను ఐటీ హబ్ గా చూసేందుకు ఇదో సువర్ణ అవకాశం కూడా..
* భూములు కేటాయింపు..
కొద్ది నెలల కిందట ఈ డేటా సెంటర్( data centre ) నిర్మాణానికి ఒప్పందం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంతో. విశాఖలో ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన భూములను కూడా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇతర పరిపాలన పరమైన అనుమతులు కూడా దాదాపు పూర్తి కావడంతో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. విశాఖలోని అడవివరం, తర్లువాడ, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ప్రాంతంలో.. మొత్తం 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ మూడు ప్రాంతాల్లో ఆ భూమి స్వాధీనం ఇచ్చే క్రమంలో చదును చేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. పర్యావరణ నిబంధనలకు లోబడి, స్థిరమైన ఇంధన వనరుల వినియోగంతో ఈ గ్రీన్ డేటా సెంటర్ నిర్మితం కానుంది.
* ఆసియా ఖండంలో పెద్దది..
ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇది. భారతదేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా భావిస్తున్నా ఈ ప్రాజెక్టులో.. ఆదానీ ఇన్ఫ్రా( Adani Infra) భాగస్వామి సంస్థగా వ్యవహరిస్తోంది. కేవలం సమాచార నిల్వకే ఈ కేంద్రం పరిమితం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు, క్లౌడ్ కంప్యూటింగ్, గ్లోబల్ టెక్ సర్వీసులకు ప్రధాన కేంద్రంగా మారనుంది.1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
* మారనున్న ఉత్తరాంధ్ర స్వరూపం..
విశాఖలో ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర స్వరూపమే మారనుంది. ఐటీ అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి రానున్నాయి. 2028 ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అందుబాటులోకి వచ్చిన మరుక్షణం అంతర్జాతీయ టెక్ కంపెనీలు మరిన్ని ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని ఏఐ రాజధానిగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో మరింత దగ్గర కానుంది.