Artificial Intelligence Effect: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు మీడియాలో వేల ఉద్యోగాలు తొలగింపు

'ఆక్సెల్ స్ప్రింగర్' సంస్థలో 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రింట్ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియా వైపు మారిపోవాలని ఈ కంపెనీ భావిస్తోంది.

Written By: Bhaskar, Updated On : June 26, 2023 3:05 pm

Artificial Intelligence Effect

Follow us on

Artificial Intelligence Effect: నిన్న మొన్నటిదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ పరిశ్రమను మాత్రమే ప్రభావితం చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ, ఇది తీసుకొస్తున్న మార్పులు ఐటీ పరిశ్రమను మాత్రమే కాదు, చాలా రంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలామంది ఉద్యోగులను తొలగించాయి. అచ్చం మనిషి లాగానే పని చేయడం వల్ల ఈ టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఆధారిత సేవల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్ జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇప్పుడున్న టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ టెక్నాలజీ మీద పుంఖానులు పుంఖాలుగా వార్త కథనాలు రాస్తున్న, ప్రచురిస్తున్న మీడియా రంగంపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనదేశంలో ఆ ప్రభావం లేదు కానీ ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ‘ఆక్సెల్ స్ప్రింగర్’ తన న్యూస్ రూమ్ సిబ్బంది లోని 20 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. వీరి స్థానాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రింట్ ప్రొడక్షన్లో పనిచేసే ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, ఇతర ఉద్యోగులను కూడా తొలగిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ విభాగాల్లో సుమారు 200 మంది పనిచేస్తుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వారంతా కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు.

‘ఆక్సెల్ స్ప్రింగర్’ సంస్థలో 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రింట్ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియా వైపు మారిపోవాలని ఈ కంపెనీ భావిస్తోంది. ప్రింటింగ్ సెక్షన్ నుంచి వైదొలగాలని యోచిస్తున్న నేపథ్యంలో అందులో పని చేస్తున్న పాత్రికేయులను ఉంచుతున్నామని, కేవలం ప్రింటింగ్ సెక్షన్లో పనిచేసే ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నామని సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి, ఉద్యోగుల తొలగింపుకు ఎటువంటి సంబంధం లేదని
‘ఆక్సెల్ స్ప్రింగర్’ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రికేయులకు సహకరిస్తుందని ప్రకటించింది. ‘ఆక్సెల్ స్ప్రింగర్’ ప్రకటన ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పాత్రికేయులు ఒకింత ఆందోళన గానే ఉన్నారు.. భవిష్యత్తులో దీనిని ఇతర అవసరాలకు యాజమాన్యాలు వినియోగిస్తే తమ పరిస్థితి ఏమిటి అనే భయం పాత్రికేయులను కుంగదీస్తోంది.