5g Network Launch: ఎన్నాళ్ళో నుంచో భారతీయులను ఊరిస్తూ వస్తున్న ఐదో తరం టెలికాం సేవలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో జరిగే అఖిల భారతీయ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదోతరం టెలికాం సేవలను లాంచనంగా ప్రారంభిస్తారు. మొదట ఈ సేవలు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. తర్వాత దశలవారీగా దేశమంతా విస్తరించనున్నాయి. జియో, ఎయిర్టెల్ మాత్రమే 5జి సేవలను ప్రారంభిస్తాయి. వోడాఫోన్ ఐడియాకు మాత్రం కొంత సమయం పడుతుంది.

ఫోర్ జి కంటే 5జి చాలా స్పీడ్
5 జి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఎటువంటి బఫరింగ్ లేకుండా హై క్వాలిటీ వీడియోలను స్టీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ తో హై గ్రాఫిక్స్ గేమ్స్ ప్లే చేస్తుంది. మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్, హై డెఫినిషన్ వీడియోస్ స్ట్రీమింగ్ వంటి సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా యాక్సిస్ పొందవచ్చు. ఇందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సినీ 5జీ అందిస్తుంది. ఆ మధ్య 5జీ స్పెక్ట్రాన్ని ప్రభుత్వం వేలం వేసింది. స్పెక్ట్రమ్ సి బ్యాండ్ సబ్ 1 GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని 5జి అందిస్తుంది. టాప్ లైన్ స్పీడ్ పరంగా చెప్పాలంటే ప్రస్తుతం వాడుతున్న 4జి కంటే 5జి వేగం ఏడు నుంచి పదిరెట్ల వరకు అధికంగా ఉంటుంది. శనివారం నుంచి మెట్రో నగరాల్లో ఫైవ్ జి సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాము ట్రూ 5జీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. 5జీ సేవలు ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాయి. క్రమక్రమంగా దేశవ్యాప్తంగా ఐదవ తరం టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఐదోతరం టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చే 13 నగరాల పేర్లను కమ్యూనికేషన్ విభాగం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐదవతరం టెలికం సేవలు అందించేందుకు తాము భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో వాటిని రికవరీ చేసేందుకు మెట్రో నగరాలే ఉత్తమం అని కంపెనీలు అంటున్నాయి. పెద్దపెద్ద నగరాల్లో కవరేజ్ అందుబాటులోకి రావడం వల్ల తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు త్వరగానే వస్తాయని టెలికాం ఆపరేటర్లు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేందుకు టాప్ 100 భారతీయ నగరాల్లో ఫై జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసినట్టు జియో ప్రకటించింది. మరో వైపు 2024 నాటికి దేశం మొత్తం ఐదవ తరం టెలికామ్ సేవలను కవర్ చేయాలనే సంకల్పంతో భారతి ఎయిర్టెల్ ఉంది. ప్రస్తుతం 5 జీ పోటీ ఎయిర్టెల్, జియో మధ్య ఉంది. మెట్రో సిటీల్లో జియో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. దానిని దక్కించుకునేందుకు ఎయిర్టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అయితే శనివారం నుంచి ఐదవ తరం టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఇప్పటికే కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. ఒక సర్వే ప్రకారం ఐదో తరం టెలికం సేవల్లో దేనిని మీరు ఇష్టపడతారని ప్రజలను అడగగా.. మెరుగైన సిగ్నల్ ఉన్నప్పుడే ఇంటర్నెట్ వాడతామని, బఫరింగ్ వల్ల తమ ఏకాగ్రత దెబ్బతింటుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో పోటీ పడుతున్నాయి. అయితే నాలుగో తరం టెలికాం సేవల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో తీవ్రమైన అపప్రదను మూట కట్టుకున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో ఐదవ తరం టెలికాం సేవల విషయంలో ఎటువంటి పాఠాలు నేర్చుకున్నాయో.. త్వరలో అవగతం కానుంది.