Smart watch : సాంకేతిక కాలంలో డబ్బులను చెల్లించే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. మన అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ అన్నింటికీ ఉపయోగపడుతోంది. అందులో ప్రముఖమైనది డిజిటల్ చెల్లింపు.. ఫోన్ ఆన్ చేసి స్కాన్ చేసి చెల్లించాల్సిన డబ్బులు అందులో టైప్ చేసి..పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు.. నగదు బట్వాడ అయిపోతుంది. కరోనా సమయం తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. కూరగాయల దుకాణం నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు క్యూ ఆర్ కోడ్ స్కాన్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే నేటి సాంకేతిక కాలంలో ఓ ఆటో డ్రైవర్ తన బుర్రకు పదును పెట్టాడు. క్యూఆర్ కోడ్ ను వినూత్నంగా రూపొందించాడు. అది కాస్త సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. అతని తెలివితేటలు చూసిన నెటిజెన్లు వారేవా అంటూ అభినందిస్తున్నారు. అతడు ఆటో డ్రైవర్ కాకపోయి ఉంటే కచ్చితంగా శాస్త్రవేత్తగా స్థిరపడిపోయేవాడని కితాబిస్తున్నారు.
క్యూఆర్ కోడ్ అడగ్గానే..
ఆ డ్రైవర్ నడుపుతున్న ఆటోను ఓ వ్యక్తి ఎక్కాడు. తను దిగాల్సిన గమ్యస్థానం వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ అడిగాడు. దీంతో ఆ డ్రైవర్ వెంటనే తన చేతికి ఉన్న వాచి చూపించాడు. ఆ డ్రైవర్ బెంగళూరు నగరానికి చెందినవాడు. తన చేతికి ధరించే వాచీలోనే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకున్నాడు. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లో క్యూఆర్ కోడ్ చూపించాడు. ఆ క్యూఆర్ కోడ్ చూసిన కస్టమర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటో కూడా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీసింది.. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు..” మన దేశం డిజిటల్ వైపు పరుగులు తీస్తోంది. చెల్లింపులు కూడా ఆ విధానంలో కొనసాగుతుండడం గొప్పగా ఉంది. దీనివల్ల ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోవు. పైగా దొంగల భయం అనేది ఉండదు. డబ్బులు తీసుకెళ్లాల్సిన అవసరం అంతగా ఉండదు.. అయితే ఇలాంటి సమయంలో బిట్ కాయిన్లను అనుమతిస్తారా అంటూ” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఆ ఆటో డ్రైవర్ కొంతమేర చదువుకున్నాడని.. కుటుంబ పరిస్థితులు బాగోలేక ఆటో డ్రైవర్ గా మారారని తెలుస్తోంది. కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా తనకు అనువుగా మార్చుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ ఎక్స్ లో ఆ ఆటో డ్రైవర్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More