Homeట్రెండింగ్ న్యూస్Sunita Williams Return: నింగి నుంచి నేలకు.. 9 నెలల నిరీక్షణ ఫలించిన వేళ.. క్షేమంగా...

Sunita Williams Return: నింగి నుంచి నేలకు.. 9 నెలల నిరీక్షణ ఫలించిన వేళ.. క్షేమంగా ల్యాండ్‌ అయిన సునీత విలియమ్స్‌..

Sunita Williams Return: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరియు ఆమె సహచరుడు బుచ్‌ విల్మోర్‌(Buch Wilmore) సుమారు తొమ్మిది నెలల అంతరిక్ష వాసం తర్వాత భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌకలో మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి బయల్దేరిన వీరు, బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరం సమీపంలోని సముద్రంలో విజయవంతంగా దిగారు. ఈ ప్రయాణంలో వ్యోమనౌక గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చి, క్రమంగా వేగం తగ్గించుకుంది. గంటకు 116 మైళ్ల వేగానికి చేరుకున్న తర్వాత నాలుగు పారాచూట్ల సాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్‌ అయింది.
నాసా(NASA) సిబ్బంది వెంటనే చిన్న బోట్ల సహాయంతో వ్యోమనౌకను ఒక నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లను హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు నిపుణులు సహాయం అందిస్తారు.

ఉత్కంఠకుర..
గతేడాది జూన్‌ 5న బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఐ కు చేరుకున్న సునీత మరియు విల్మోర్, కేవలం ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా స్టార్‌లైనర్‌ వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. దీంతో వారు ISS లోనే ఉండిపోయారు. తొమ్మిది నెలల తర్వాత, స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ ద్వారా వారు భూమికి తిరిగి రాగలిగారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 గంటలకు ISS నుంచి బయల్దేరిన వ్యోమనౌక, బుధవారం తెల్లవారుజామున భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియను నాసా ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. 3:26 గంటలకు భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో పారాచూట్లు తెరుచుకోగా, 3:28 గంటలకు వ్యోమనౌక సముద్రంలో దిగింది. 4:23 గంటలకు సునీతను మాడ్యూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ విజయంతో సునీత తన మూడో అంతరిక్ష యాత్రను కూడా సఫలం చేసుకున్నారు. గతంలో 2006, 2012లో రెండు సార్లు ఆమె ఇలాంటి యాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు.

హ్యాపీ మార్నింగ్‌..
సునీత రాకకోసం ఉత్కంఠలో నిరీక్షిస్తున్న భారతీయులకు బుధవారం(మార్చి 19) హ్యాపీ మార్నింగ్‌గా చెప్పవచ్చు. ఆమె క్షేమంగా భూమికి చేరడంతో భూమికి చేరుకోవడంతో అందరి మోములో సంతోషం కనిపిస్తోంది. అయితే సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం వల్ల వ్యోమగాములకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు వైద్యులు హ్యూస్టన్‌లో వారిని పరీక్షించనున్నారు. సునీత రాకతో నాసా శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

క్రూ క్యాప్సుల్‌ ల్యాండింగ్‌ ఇలా..

తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్లో ఐఎస్‌ఎస్‌ నుంచి బయల్దేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు అన్లాకింగ్‌ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజిన్లను మండించి క్రూ డ్రాగన్‌ ను భూవాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. దీని ల్యాండింగ్‌ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

2.17: స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ షురూ
2.18: లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్‌ పూర్తి
2.35: కక్ష్య నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది.
2.51: కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ పూర్తయి.. స్పేస్‌ క్రాఫ్ట్‌ కిందకు దిగడం ప్రారంభమైంది.
3.10: డ్రాగన్‌ ఫ్రీడమ్‌ మాడ్యూల్‌ భూవాతావరణంలోకి ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్‌ ఎక్స్‌ గ్రౌండ్‌ స్టేషన్తో సిగ్నల్‌ కట్‌ అయింది. 3.21కి సిగ్నల్‌ కలిసింది.
3.26: భూమికి 5 కి.మీ. ఎత్తులో ఉండగా పారాచూట్లు తెరుచుకున్నాయి.
3.28: డ్రాగన్‌ మాడ్యూల్‌ సురక్షితంగా సముద్రంలో దిగింది.
3.55: మాడ్యూల్‌ న్ను నౌకలో ఎక్కించారు.
4.23: మాడ్యూల్‌ నుంచి సునీతను బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ కు తరలించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular