Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని పనులు పూర్తయిన తర్వాత ఎప్పటికోగాని విశ్రాంతి లభించదు. ఒక్కోసారి అనారోగ్యానికి గురైనప్పటికీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. ఆ పని మొత్తం చేయాల్సిందే. ఇది మనదేశంలో సగటు అమ్మల పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అయితే ఇతర పనులు చేస్తూ.. ఇంటి పనులు కూడా పూర్తి చేయాలి.
చూసేందుకు ఇది చాలామందికి చిన్నపాటి వ్యవహారం లాగానే ఉంటుంది. కానీ ఇంతటి పని చేయాలంటే మామూలు విషయం కాదు. శారీరకంగా ఇబ్బంది పడాలి. కొన్ని సందర్భాలలో ఇతర అనారోగ్యాలు ఉన్నప్పటికీ పనిచేస్తూనే ఉండాలి. మిగతా వారికి ఏమోగానీ.. ఆ యువకుడికి తన తల్లి చేస్తున్నది బాధనిపించింది. ఇంత చాకిరి తన తల్లి చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్న అతనిలో వ్యక్తం అయింది. ఇంకేముంది తన బుర్రకు పదును పెట్టాడు. తన తల్లి కష్టాలు చూడలేక ఆవిష్కరణలకు నడుం బిగించాడు.
అలాగని అతడేమి ఖరీదైన వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయలేదు. వ్యాక్యూమ్ క్లీనర్ లను కొనుగోలు చేయలేదు. వంటకు.. ఇంటికి పని మనుషులను నియమించలేదు. జస్ట్ తన ఇంట్లో వాడిపడేసిన వస్తువులను అందుబాటులో తీసుకొచ్చాడు. వాటికి సరికొత్త రూపాన్ని ఇచ్చాడు. చిన్నచిన్న వస్తువులతో వాషింగ్ మిషన్.. రూఫ్ క్లీనర్.. ఇంకా అనేక రకాల వస్తువులను తయారు చేశాడు. తన తల్లి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఉండడానికి వాటిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. అతడు చేసిన ఈ వస్తువులు సాధారణమైనవే కావచ్చు. మార్కెట్లో పెద్దగా విలువ లేనివి కావచ్చు. కాకపోతే అతడి తల్లి కష్టాన్ని తీర్చాయి. ఆమెకు ఒక ఆలంబన ఇచ్చాయి. ఆమె కష్టంలో సుఖాన్ని కలిగించాయి.
తన ఆవిష్కరణలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెచ్చుకున్నాడు ఆ యువకుడు. అయితే అవి కాస్త విశేషమైన ఆదరణ పొందడంతో ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళాయి. ముఖ్యమంత్రి కూడా ఆ యువకుడి తాపత్రయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశాడు. నేరుగా ఆ యువకుడు ఇంటికి వచ్చి అభినందించాడు.
అన్నట్టు ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు లెవెన్ ఫాలోస్. ఇతడు కేరళ రాష్ట్రంలో ఉంటాడు. ఇతడని సామాజిక మధ్యమలలో దాదాపు రెండు లక్షలకు పైగా యూజర్లు అనుసరిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి సతీషన్ ప్రత్యేకంగా అభినందించారంటే ఈ యువకుడి టాలెంట్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


