Homeలైఫ్ స్టైల్Chandrayaan 3: జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్‌–3.. మరికొన్ని చంద్రుడి ఫొటోలు వైరల్

Chandrayaan 3: జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్‌–3.. మరికొన్ని చంద్రుడి ఫొటోలు వైరల్

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై అధ్యయనానికి పంపిన చంద్రయాన్‌–3 ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తోంది. జూలై 14న శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–3 స్పేస్‌ క్రాఫ్ట్‌.. 22 రోజుల పాటు భూ కక్ష్యలోనే ఉంది. అనంతరం ఆగస్టు 5న దీనిని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అత్యంత కీలక ఘట్టం విజయవంతం కావడంతో జాబిల్లి చెంతకు చేరడానికి మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది. ఆగస్టు 6 మరోసారి కక్ష్య పెంచారు. తిరిగి 9న మళ్లీ మరోసారి ఇంజిన్‌ను మండించారు. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌–3.. అక్కడ ఉపరితలం ఫొటోలను తీసింది. ఈ ఫోటోలను చంద్రయాన్‌–3 మిషన్‌∙అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

ఆగస్టు 6న చంద్రుడి కక్ష్యలోకి..
లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సెర్షన్‌ ప్రక్రియను ఆగస్టు 6న చేపట్టారు. ఈ సమయంలో స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌ను మండించారు. ఇది శక్తివంతమైన బ్రేకులా పని చేస్తుంది. స్పేస్‌ క్రాఫ్ట్‌ వెళ్తున్న దిశకు వ్యతిరేకంగా ఆన్‌ బోర్డ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను మండించడం వల్ల స్పేస్‌ క్రాఫ్ట్‌ వేగం తగ్గుతుంది. భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ.. వ్యౌమనౌక వేగంగా ప్రయాణించేలా ఇస్రో చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని చేపట్టింది. క్రమంగా స్పేస్‌ క్రాఫ్ట్‌ వేగం తగ్గడం వల్ల సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరుగుతుంది. లూనార్‌ కక్ష్యలో చంద్రుడి గురుత్వాకర్షణ బలం ప్రభావం ఉంటుంది. దీని వల్ల క్రమంగా అది చంద్రుడి స్థిర కక్ష్యలోకి లాగబడుతుంది. ఈ క్రమంలో మాడ్యుల్‌ వేగం, చంద్రుడి గురుత్వాకర్షణ, థ్రస్ట్‌ దిశ మధ్య సమతౌల్యత అవసరం. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఆగస్టు 23న చంద్రయాన్‌–3 చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలం మీద సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవుతుంది. మాడ్యూల్‌ ఎత్తును క్రమంగా తగ్గించి, చంద్రుని చుట్టూ 100 కి.మీ. దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాన్ని ఉంచడం కోసం ఇస్రో అనేక విన్యాసాలు చేపడుతుంది.

మరోసారి కక్ష్య తగ్గింపు
చందమామ చుట్టూ చక్కర్లు కొడుతున్న చంద్రయాన్‌–3 వ్యోమనౌక కక్ష్యను మరోసారి తగ్గించారు. చంద్రుడికి దగ్గరగా 174 కిలోమీటర్లు, దూరంగా 1,437 కిలోమీటర్ల దూరంలో ఉండే దీర్ఘ వృత్తాకార చంద్ర కక్ష్యలోకి చంద్రయాన్‌–3ని ప్రవేశపెట్టారు. మూడోసారి బుధవారం మధ్యాహ్నం 1.35 గంటల దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా ఇస్రో నిర్వహించింది. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 12.30 లోపు మరోసారి కక్ష్య దూరాన్ని తగ్గిస్తామని ఇస్రో ప్రకటించింది. కక్ష్య దూరాన్ని తగ్గిస్తూ చివరకు వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి వ్యోమనౌకను తీసుకొస్తారు. ఆ తర్వాత కమాండ్‌ను పంపి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్, రోవర్లను విడదీస్తారు. ల్యాండర్‌ నెమ్మదిగా చంద్రుడిపై దిగుతుంది.

తాజాగా మరో ఫొటో..
లూనార్‌ ఆర్బిట్‌ ఇన్‌సెర్షన్‌ తర్వాత ల్యాండర్‌ హారిజెంటర్‌ వెలాసిటీ కెమెరా చంద్రుడిని ఫొటోలు తీసింది. ఈ ఫొటోలను ఇస్రో తాజాగా రిలీజ్‌ చేసింది. అలాగే ప్రయోగం రోజు కూడా చంద్రయాన్‌–3 తీసిన భూమి ఫొటోలను కూడా అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular