HomeజాతీయంChandrayaan 3 : తిండి, నిద్ర, జీవితం.. సర్వం చంద్రుడికే అంకితం

Chandrayaan 3 : తిండి, నిద్ర, జీవితం.. సర్వం చంద్రుడికే అంకితం

Chandrayaan 3 : చంద్రయాన్_3 విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి సాధారణ సర్పంచ్ వరకు ఇస్రో పనితీరును కొనియాడుతున్నారు. ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తుందని కీర్తిస్తున్నారు.. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తోందని ఆయన ప్రకటించారు. చంద్రయాన్_3 విజయవంతమైన వెంటనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సామాజిక మాధ్యమ వేదిక “ఎక్స్” లో ట్వీట్ ద్వారా భారతీయులందరినీ అభినందించింది. ” చంద్రయాన్_3 మిషన్.. భారతదేశమా నేను నా గమ్యస్థానాన్ని చేరుకున్నాను. నువ్వు కూడా” అని ట్వీట్ చేసింది. “సున్నితంగా, విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మూడు రంగుల జెండా పాతామని” ప్రకటించింది. భారతదేశానికి అభినందనలు తెలిపింది.

ముందుగా చెప్పినట్టుగానే..

విక్రం లాండర్ ఇస్రో ప్రకటించిన షెడ్యూల్ కు అనుగుణంగానే బుధవారం సాయంత్రం 6 గంటల నాలుగు నిమిషాలకు చంద్రుడి మీద అడుగు పెట్టింది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన తొలి దేశం భారత్ కావడం విశేషం. టెక్నాలజీ పరంగా దేశం కంటే ముందు వరుస లో ఉన్న అమెరికా, చైనా, రష్యా కు కూడా ఈ ఘనత సాధ్యం కాకపోవడం విశేషం.. ఈ విజయం సాధించిన తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మీడియా సమావేశంలో తన ఆనందాన్ని పంచుకున్నారు. “ప్రయోగ సమయంలో అత్యంత సంక్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాతో మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలు, భారత దేశం సైన్స్ రంగంలో ముందు వరుసలో ఉండాలని చెప్పారు. చంద్రయాన్_ 3 కి ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రౌండ్ స్టేషన్ల నుంచి సహకారం లభించింది. మాకు ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు సమాచారం అందింది. తక్కువ ధరల్లో ఇటువంటి ప్రయోగాన్ని నిర్వహించగలిగేది కేవలం మన దేశం మాత్రమే. చంద్రయాన్_3 లోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. ఉత్కంఠమైన తదుపరి 14 రోజుల ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాం. ఇది సువర్ణాధ్యాయానికి నాంది. చంద్రయాన్_3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు ఫోన్ చేసి అభినందించారు” అని సోమనాథ్ పేర్కొన్నారు.

త్వరలో ఆదిత్య ఎల్ _ 1

చంద్రుడివంతయిన తర్వాత సూర్యుడి మీద ప్రయోగాలు చేస్తామని ఇస్రో చెబుతోంది. త్వరలో ఆదిత్య ఎల్ _1 ను ప్రయోగిస్తామని వివరిస్తోంది. అయితే దీనిపై తీవ్ర ఉత్కంఠ గా ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పై నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని చేరుకోవడానికి 120 రోజుల టైం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. గగన్ యాన్ అబార్ట్ మిషన్ సెప్టెంబర్ నెలాఖరులో గాని, అక్టోబర్ మొదటి వారంలో గాని నిర్వహిస్తామని చెబుతున్నారు.

తిండి, నిద్ర మొత్తం దానికోసమే

చంద్రయాన్_3 కోసం ఇస్రో బృందం పడిన శ్రమ అంతా అంతా కాదు. ఈ కార్యక్రమం కోసం ఆ బృందం తీవ్రంగా కష్టపడింది. 4 సంవత్సరాల పాటు తిండి, నిద్ర, జీవనం మొత్తం చంద్రుడి కోసమే కేటాయించింది. సభ్యులు కొంతమంది ఇళ్లకు వెళ్లడం కూడా మానేశారు. ఇది విజయవంతం కావడంతో తమ మీద తీవ్ర ఒత్తిడి పెరిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడి మీదికి మానవులను పంపించడం, అంగారక గ్రహం పైకి వ్యోమ నౌకను పంపించడం గురించి ఆలోచిస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన వారందరికీ వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular