Interlocking Technology: తెలంగాణలో అనేక మెట్ల బావులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. అయితే వీటి సంరక్షణకు పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అయితే గత తెలంగాణ ప్రభుత్వం పురాతన, చారిత్రక కట్టడాలను సంరక్షించడానికి, పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఇందులో మెట్ల బావులు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్ల బావుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉన్న 11వ శతాబ్దపు మెట్ట బావిని పునరుద్దరించడానికి కూడా చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఉన్న ఏడుగురు వాస్తుశిల్పులు, వారసత్వ సంపద పరిరక్షకులను పంపించింది. దీంతో ఈ బావి చరిత్ర బయటకు వచ్చింది. పొలాస రాజులు దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు గుర్తించారు. దీనిని పాత నగరంతోపాటు వేద పాఠశాలలకు, ఆలయాల కోసం నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ బావిని డంప్ యార్డుగా మార్చేశారు. మహిళలు రోజువారీ పనుల కోసం ఈ మెట్ల బావి నుంచే నీటిని తెచ్చుకునేవారట. మెట్ల బావి ఆవరణలో బతుకమ్మ పండుగ జరుపుకునేవారు. పునరుద్ధరణ ద్వారా బాబి గొప్పతనాన్ని తిరిగి తీసుకురావాలని, పండుగలు, సమావేశాలను జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన కమ్యూనిటీ ప్రదేశంగా అభివృద్ధి అధికారులు భావిస్తున్నారు.
చారిత్రక ఆధారాలు..
కోరుట్ల మెట్ల బావి, దాని చరిత్ర గురించి చాలా ప్రత్యేకమైన కథనాలు ఉన్నాయి. జైన పోషకులుగా ఉన్న పొలాస రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలోనే ఈ బావి మెట్లు, స్తంభాల నిర్మాణానికి ఇంటర్ లాకింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. సాంకేతికత అంతగా తెలియని కాలంలోనే ఇలా స్తంభాలు నిర్మిచండం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ బావి లోపలికి వెల్లడానికి కూడా మార్గం ఉంది. బావి లోపల, పైన దీపాలు పెట్టుకునే ఏర్పాట్లు చేశారు.
పునరుద్ధరణకు చర్యలు..
ఇంతటి పురాతన టెక్నాలజీ, చారిత్రక నేపథ్యం ఉన్న కోరుట్ల మెట్ల బావిని పునరుద్ధరించేందుకు స్థానిక మున్సిపల్ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. మొదట బావిలోని చెత్త, శిథిలాలను తొలగించారు. చుట్టూ కంచె వేశారు. తర్వాత పురావస్తు శాఖ అధికారులు, చారిత్రక పరిశోధకులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరమ్మతులు, పునర్నిర్మాణం, విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు తదితర పనులు చేపట్టారు.