Smart Phone : ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి పని దాని ఆధారంగా జరుగుతుండడంతో ప్రాధాన్యమైన వస్తువుగా మారిపోయింది.. ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి కాకుండా, ప్రతిదీ దాని ద్వారానే జరుగుతోంది. ఫోటోల దగ్గర నుంచి మొదలుపెడితే విలువైన సమాచారం వరకు అన్ని అందులోనే నిక్షిప్తమై ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకు నుంచి సినిమా టికెట్ల బుకింగ్ వరకు ప్రతీ ఒక్కదానికి ఇప్పుడు ఫోనే ఆధారం. అయితే అలాంటి ఫోన్ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో పోతే.. ఇక తలనొప్పి మొదలైనట్టే. విలువైన సమాచారం, ఫోటోలు అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి వెళితే అంతే సంగతులు.
ఫోన్ పోవడం లేదా ఎవరైనా ఎత్తుకెళ్లడం, చోరీకి గురికావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు.. తస్కరణకు గురైన ఫోన్ స్థానాన్ని కనుక్కునేందుకు అత్యంత సులభమైన మార్గం ఉంది.. Google find my device అనే యాప్ ద్వారా పోయిన ఫోన్ గుర్తించేందుకు వీలుపడుతుంది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకోవాలి. అందులో Gmail account ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ యాప్ ద్వారా కేవలం సొంత మొబైల్ మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే ఇతర వ్యక్తుల ఫోన్ల సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో ఈ యాప్ లో సేవ్ చేస్తేనే వాటిని ట్రాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.. ఈ యాప్ ను పూర్తిగా ఇన్ స్టాల్ చేసిన తర్వాత.. ఫోన్ లొకేషన్ ఎప్పటికీ ఆన్ లోనే ఉండాలి. యాప్ అలర్ట్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది.. ఫోన్ పోయిన తర్వాత దాన్ని ఆన్ చేసినప్పుడల్లా అలారం మోగుతూ ఉంటుంది.. ఇక ఇంట్లోనే ఇతర సభ్యులు కూడా వారి ఫోన్ లను యాప్ కు లింకును Gmail account కు యాడ్ చేసుకోవాలి. ఫలితంగా ఫోన్లలో ఒక్కటి పోయినా.. ఇతర ఫోన్లలో ఉన్న సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఇలా గూగుల్ యాప్ వాడటం వల్ల ఫోన్ ఆచూకీ లేదా తస్కరణకు గురైన ఫోన్ అడ్రస్ సులభంగా తెలుసుకోవచ్చు. పోలీసుల వద్దకు వెళ్లకుండానే, మరొకరి సహకారం తీసుకోకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి ఫోన్ వెళ్ళినప్పటికీ.. అందులో ఉన్న సమాచారాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు.. పోలీసులు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను పసిగట్టేస్తున్నారు.. బాధితులకు నిర్ణీత కాలంలోనే వారి ఫోన్లను అందజేస్తున్నారు. అయితే ఫోన్ల దొంగతనాలు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో.. వినియోగదారులు జాగ్రత్తగా ఉండడం మేలని సూచిస్తున్నారు పోలీసులు. సాధ్యమైనంతవరకు ప్రొటెక్షన్ యాప్స్ వాడాలని హితవు పలుకుతున్నారు.