https://oktelugu.com/

YouTube: హ్యాకర్స్ దేన్నీ వదిలిపెట్టడం లేదు… మీ యూట్యూబ్ వారి చేతుల్లోకి వెళితే.. ఇలా కాపాడుకోండి!

YouTube: సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో మనం చూస్తూనే ఉన్నాం. కళ్ళ ముందుకే అన్ని వస్తున్నాయి. చేతివేళ్లతోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పంటికిందరాయిలా మేమున్నామంటూ హ్యాకర్లు సవాల్ చేస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 25, 2024 / 03:59 AM IST

    YouTube

    Follow us on

    YouTube: సోషల్ మీడియాలో యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి రుసుము చెల్లించకుండానే రోజు లక్షలాది వీడియోస్ చూసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఫోన్ పే, గూగుల్ పే, వాట్సాప్ ను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు.. ఇప్పుడు యూట్యూబ్ మీద కూడా పడ్డారు. యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే వారి ఖాతాలను హ్యాక్ చేస్తూ డబ్బులు లాగుతున్నారు. కొందరైతే వారి ఖాతాల్లో ఉన్న సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇటీవల ఈ తరహా సంఘటనలు పెరిగిపోయాయి. సైబర్ పోలీసులకు వస్తున్న ఫిర్యాదుల్లో ఈ తరహావి కూడా ఉంటున్నాయి. కొన్నిసార్లు యూట్యూబర్లు తట్టుకోలేక మరొక ఛానల్ ప్రారంభించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అయితే ఈ సమస్యకు గూగుల్ ఇప్పుడు పరిష్కారం మార్గం చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతోంది.

    ఒకవేళ youtube ఖాతా కనుక హ్యాక్ అయితే.. దానిని రికవరీ చేసుకునేందుకు కొత్త టూల్ ను గూగుల్ ఏర్పాటు చేసింది. గూగుల్ ఖాతా, యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ.. ఆ తర్వాత లాగిన్ అవకాశాన్ని పునరుద్ధరిస్తుంది. ఒకవేళ హ్యాకర్ ఏదైనా తనకు నచ్చినట్టుగా మార్పులు చేస్తే వాటిని నిర్మొహమాటంగా తొలగిస్తుంది. ఆ తర్వాత పాత స్థితికి తీసుకొస్తుంది.

    ఈ టూల్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ అసిస్టెంట్ రూపంలో google అందుబాటులోకి తీసుకురానుంది. ఒకవేళ ఖాతా హ్యాక్ అయినట్టు ఈ టూల్ స్పష్టం చేస్తే.. గూగుల్ ను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే రికవరీ చేసేందుకు అనుమతి ఉంటుంది. ప్రొఫైల్ పిక్చర్, యాడ్ సెన్స్ ఖాతాలో మార్పులు సహా అనధికార వీడియోల అప్లోడ్ వంటి మార్గాల ద్వారా తొలుత ఖాతా హ్యాక్ అయిందో లేదో నిర్ధారించుకోండి అని గూగుల్ సూచిస్తుంది. ఒకవేళ అది గనుక నిజమైతే యూట్యూబ్ హెల్ప్ సెంటర్ ద్వారా ఆ టోల్ ఉపయోగించి ఎకౌంటు రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.

    గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూల్ ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. పైగా ఇది ఇంగ్లీషులో మాత్రమే లభ్యమవుతోంది. కొంతమంది ఎంపిక చేసిన థియేటర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది. ఒకవేళ ఈ టూల్ అవసరం ఉండి.. ప్రస్తుతానికి అందుబాటులో లేకపోతే ట్విట్టర్ ఎక్స్ లో @ team YouTube ను సంప్రదించి వారి సహాయాన్ని పొందొచ్చు. ఇదే విషయాన్ని గూగుల్ తన సపోర్ట్ పేజీలో ప్రకటించింది.. అయితే ఎకౌంటు రికవరీ చేసే క్రమంలో మరిన్ని సాంకేతిక ప్రయోగాలు చేస్తున్నట్టు గూగుల్ ఇప్పటికే ప్రకటించింది.